యాదాద్రి కాదు.. యాదగిరిగుట్టనే! పేరు మార్పు పక్కా!
యాదాద్రి పేరు కాదని పాత పేరైన యాదగిరిగుట్ట పేరును పెట్టేందుకు వీలుగా ప్రయత్నాలు మొదలయ్యాయి.
By: Tupaki Desk | 2 March 2024 4:50 AM GMTప్రభుత్వాలు మారినంతనే అప్పటివరకు అమలయ్యే సంక్షేమ పథకాలకు కాసిన్ని మార్పులు చేసుకోవటం.. పేర్లు మారిపోవటం లాంటివి మామూలే. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ సర్కారు హయాంలో దశాబ్దాలుగా పిలిచే యాదగిరిగుట్టను యాదాద్రిగా నామకరణం చేసిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని మార్చేందుకు వీలుగా రేవంత్ ప్రభుత్వం రెఢీ అయ్యింది. యాదాద్రి పేరు కాదని పాత పేరైన యాదగిరిగుట్ట పేరును పెట్టేందుకు వీలుగా ప్రయత్నాలు మొదలయ్యాయి.
త్వరలో యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి రేవంత్ వెళతారని.. ఈ క్షేత్రాన్ని డెవలప్ చేసేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న నెల రోజుల్లో ముఖ్యమంత్రి రివ్యూ చేస్తారని చెబుతున్నారు. తాజాగా టెంకాయ కొట్టే స్థలాన్ని శుక్రవారం ప్రారంభించిన ప్రభుత్వ విప్ కం అలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.
యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా పేరు మారుస్తామని స్పష్టం చేసిన ఆయన.. ఈ పుణ్యక్షేత్రానికి పూర్వ సంప్రదాయం చేకూర్చేలా చేస్తామన్నారు. కొండ మీద డార్మిటరీ హాల్ నిర్మించి.. భక్తులు నిద్ర చేసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. పూర్వం నుంచి క్షేత్రానికి ఉన్న పేరు మార్చటం సరికాదన్న ఆయన ఆలయ పూజారుల కోసం విశ్రాంత గదులు.. మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చేందుకు వీలుగా రేవంత్ సర్కారు సిద్ధమవుతుందన్న విప్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీనిపై గులాబీ నేతలు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.