Begin typing your search above and press return to search.

అప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటా... బాబు సంచలన వ్యాఖ్యలు!

ఇందులో భాగంగా.. "సిద్ధం" అంటూ వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావం పూరించగా.. "రా.. కదలిరా" అంటూ చంద్రబాబు ఫుల్ బిజీ అయిపోయారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 7:00 AM GMT
అప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటా...  బాబు సంచలన వ్యాఖ్యలు!
X

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. దీంతో... ప్రధాన పార్టీలన్నీ ఒకవైపు అభ్యర్థుల ఎంపికనా.. మరోవైపు ప్రచార కార్యక్రమాలపైనా దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా.. "సిద్ధం" అంటూ వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావం పూరించగా.. "రా.. కదలిరా" అంటూ చంద్రబాబు ఫుల్ బిజీ అయిపోయారు. ఇవాళో రేపో పవన్ ఎంట్రీ కూడా ఉంటుందని అంటున్నారు. వీరంతా ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు.

ఇక ఏపీలో నిన్నటివరకూ ద్విముఖ పోరు అని భావించిన వేళ... షర్మిళ ఎంట్రీతో కొన్ని స్థానాల్లో త్రిముఖ పోరు తప్పదని అంటున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలకూడదన్న పవన్ లక్ష్యం నెరవేరేలా లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అది ఎంత ఎక్కువగా జరిగితే జగన్ కు అంత ఎక్కువ ప్రయోజనం అనే మాటలు కూడా బలంగా వినిపిస్తున్నాయి! ఇదే సమయంలో టీడీపీకి ఈ గెలుపు అనివార్యం అని అంటున్నారు పరిశీలకులు.

అటు టీడీపీకి అయినా.. ఇటు జనసేనకైనా.. ఒకరకంగా వైసీపీకి అయినా.. ఈ గెలుపు అనివార్యం అని అంటున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా.. ప్రతిపక్ష పార్టీల మనుగడ ఆల్ మోస్ట్ ప్రశ్నార్ధకం అయిపోతుందని చెబుతున్నారు. ప్రజాతీర్పును అవహేళన చేస్తూ కండువాలు మార్చిన వారికి తర్వాత ఎన్నికల్లో ప్రజలు కర్రకాల్చి వాతపెడుతున్నా.. వారు మారరనే భావన పలువురు వ్యక్తపరుస్తున్నారు!!

ఈ సమయంలో... గెలుపోటములపై అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్... టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయి. ఇందులో భాగంగా... "ఈ 56 నెలల పాలనలో నేను శాయశక్తులా చిత్తశుద్ధితో పని చేశాను. కోట్ల మంది ప్రజలకు సహాయం అందించడం నాకెంతో సంతృప్తినిచ్చింది. 2019 ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు, చెప్పిన పనులు చేశాం. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా నాకెలాంటి విచారమూ లేదు" అని జగన్ ఇటీవల వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.

జగన్ స్టేట్ మెంట్ అలా ఉంటే... తాజాగా 2019 ఎన్నికల తర్వాత ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడిన చంద్రబాబు కాస్త డిఫరెంట్ గా స్పందించారు అనేకంటే.. సంచలనంగా స్పందించారు అనేట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ స్పందించారు చంద్రబాబు. దీంతో ఈ వ్యాఖ్యలపై రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.

అవును... 2019 ఎన్నికల ఫలితాల అనంతరం ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రబాబుకు ఒక కీలకమైన ప్రశ్న ఎదురైంది. ఇందులో భాగంగా... "వచ్చే ఎన్నికల్లో మీరు రెఫరెండం కోల్పోతే రాజకీయాలను వదిలేస్తారా?" అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు స్పందించిన చంద్రబాబు... ఆ విషయంలో తాను చాలా క్లియర్ గా ఉన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా... ప్రజలు తనను తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన సమాధానం ఇచ్చారు.

అయితే బాబుకు గతం గుర్తు చేస్తూ.. గతంలో చెప్పిన మాటలు గుర్తు చేస్తూ.. వైసీపీ నెటిజన్లు ఈ వీడియోని ఇప్పుడు తెరపై తెచ్చారా... లేక, టీడీపీ ఓటమిని పసిగట్టిన తమ్ముళ్లు ఈ విధంగా సానుభూతి ప్రయత్నాలను ప్రారంభించారా అనేది తెలియదు కానీ... 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

దీంతో... వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కూటమి ఓటమి పాలైతే.. ఇక చంద్రబాబు శాస్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని.. ఇక టీడీపీ బాధ్యతలు మొత్తం అధికారికంగా చినబాబు చేతుల్లోకి వస్తాయని.. ఫలితంగా పార్టీ మొత్తం పూర్తిగా యువరక్తంతో నిండిపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతుండగా.. అలాంటిదేమీ జరగదు... వచ్చే ఎన్నికల్లో బాబు గెలిచి నిలుస్తారని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా బాబు చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి!