సోనియా జన్మదిన వేడుకల్లో నేతల సందడి.. ఏం చేశారంటే
భారీ కేక్ ను సీఎం, సీనియర్ నేతలతో పాటు మంత్రులు కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
By: Tupaki Desk | 9 Dec 2023 5:55 PM ISTప్రమాణ స్వీకారోత్సవాలు, కొత్త మంత్రి వర్గం లాంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు సోనియా గాంధీ జన్మదినం ఉత్సాహాన్ని నింపింది. డిసెంబర్ 3వ తేదీ ఓట్ల లెక్కింపు ఉన్న సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ సోనియా గాంధీ జన్మదిన వేడుక సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆమెకు గిఫ్ట్ ఇస్తానని రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో, భారీ బహిరంగ సభల్లో చెప్పారు. ఆ మేరకు 64 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు.
కొత్త ప్రభుత్వం కొలువు దీరిన రెండు రోజుల్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు రావడంతో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ను సీఎం, సీనియర్ నేతలతో పాటు మంత్రులు కట్ చేసి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని కొనియాడారు. సోనియా గాంధీ ఆ సమయంలో నిర్ణయం తసుకోవడం వల్లే చాలా మంది తెలంగాణ వాదుల బలిదాణాలకు అర్థం ఉందని చెప్పారు. ఆమె ఇచ్చిన తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరడం ఆనందంగా ఉందన్న నేతలు ఈ రోజు నుంచే సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రారంభించారు.
‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంను ఈ రోజు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించారు. రేవంత్ రెడ్డితో పాటు మహిళా మంత్రులు సురేఖ, సీతక్క, మహిళా బాక్సర్ నిక్కత్ జరీన్, సీఎస్ శాంతి కుమారి ఉచిత ప్రయాణానికి జెండా ఊపి ప్రారంభించారు.
ఆసక్తికర విషయాలు..
సోనియా గాంధీ జన్మదినం వేడుకల్లో ఆసక్తి కర విషయాలు జరిగాయి. గాంధీ భవన్ లో భారీ కేక్ కటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉండడంతో కాంగ్రెస్ నేతలు, నాయకులు అంతా కార్యక్రమం ముగిసిన వెంటనే రాజ్ భవన్ వెళ్లారు. అక్కడ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ వేడుకలకు వచ్చిన సీనియర్ నాయకుడు వీ హన్మంతా రావుతో కేక్ కట్ చేయించారు రేవంత్ రెడ్డి. రేవంత్ పక్కన భట్టీ ఉండగా వీహెచ్ ను దగ్గరకు తీసుకున్న రేవంత్ ఆయనతో కేక్ కట్ చేయించారు. కేక్ కట్ చేసిన వీహెచ్ ముక్కను భట్టీకి తినింపించారు. భట్టీ కూడా వీహెచ్ కు కేక్ తినిపించారు. ఇలా సందడిగా గడిపిన నేతలు ఒకరికొకరు మరింత ఉత్సాహంగా కేక్ తినిపించుకున్నారు. ఇన్ని రోజులు ఎక్కువగా బయట కనిపించని వీహెచ్ ఈ రోజు ఆనందంగా గడుపుతూ కనిపించారు. రేవంత్ రెడ్డిని కౌగిలించుకొని ఆనంద బాష్పాలు కార్చారు.
ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక కేక్ ముక్కను మాణిక్యం ఠాక్రే నోట్లో పెడుతుండగా ఆయన వారించాడు. వద్దన్నట్లు చెప్పారు. కానీ వెంకట్ రెడ్డి వినిపించుకోకుండా సంబురంగా బలవంతంగా పెట్టాడు. ఇలా నాయకులు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ సోనియా గాంధీకి శుభాకాంక్షలు చెప్పారు.