Begin typing your search above and press return to search.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల అవినీతి!?

వీరిలో శంషాబాద్ సిబ్బందితో పాటు కస్టమ్స్‌ విభాగంలో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తి ఉన్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   9 July 2024 6:47 PM GMT
శంషాబాద్  ఎయిర్  పోర్ట్  లో కస్టమ్స్  అధికారుల అవినీతి!?
X

విదేశీ కరెన్సీ అక్రమ రవాణా కేసులో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం (ఆర్.జీ.ఐ.ఏ)లోని కస్టమ్స్ అధికారులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీ.ఐ.ఎస్.ఎఫ్.) ద్వారా భారీగా విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ జరుగుతుందని ఈ ఏడాది మార్చి16న వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది!

అవును... 2023 మార్చి 16న శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ, భారతీయ కరెన్సీని సీ.ఐ.ఎస్.ఎఫ్.-సీ.ఐ.డబ్ల్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రూ.4 లక్షల భారతీయ కరెన్సీని తీసుకెళ్తున్న హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తితో పాటు అతని కుమారుడి వద్ద రూ.2,93,425 కి సమానమైన వివిధ దేశాల కరెన్సీ నోట్లు ఉన్నాయని సీబీఐ అధికారులు ఎఫ్.ఐ.ఆర్.లో పేర్కొన్నారు.

సీ.ఐ.ఎస్.ఎఫ్. సిబ్బందితో పాటు క్రైం అండ్ ఇంటెలిజెన్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో భారతీయ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీని మార్పిడి చేస్తున్నారన్న సమాచారంతో సిటీ సైడ్ అరైవల్ ఏరియాలో వీరిని పట్టుకున్నట్లు చెబుతున్నారు. వీరిలో శంషాబాద్ సిబ్బందితో పాటు కస్టమ్స్‌ విభాగంలో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తి ఉన్నారని అంటున్నారు.

ఇదే సమయంలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించిన ముగ్గురు కస్టమ్స్‌ అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. వీరిలో హైదరాబాద్ నిజాంపేటకు చెందిన ఏ.శ్రీనివాసులు, ఓల్డ్ బోయినపల్లికి చెందిన పంకజ్ గౌతమ్, సికింద్రాబాద్ కు చెందిన పేర చక్రపాణిలపై కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో నిందితులకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ గత కొంతకాలంగా జరుగుతున్నట్లు తదుపరి విచారణలో వెల్లడిందని అంటున్నారు. ఈ మేరకు సీ.ఐ.ఎస్.ఎఫ్. అధికారులు ఆ కరెన్సీని సీజ్ చేసి, తదుపరి చర్యల నిమిత్తం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు కస్టమ్స్ డిపార్ట్మెంట్ సహాయాన్ని కోరింది!