గజ్వేల్ లో గెలిచిన పార్టీదే అధికారమట.. మరి ఈసారి?
ముహూర్తాలు, సెంటిమెంట్లు ఎక్కువగా కనిపించే రంగాలు రెండు.. వాటిలో మొదటిది సినిమాలు, కాగా రెండోది రాజకీయాలు.
By: Tupaki Desk | 10 Nov 2023 11:30 PM GMTతెలంగాణ నడిబొడ్డున ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు మరింత రంజుగా మారాయి. ఒకప్పడు పూర్తి వెనుకబడిన నియోజకవర్గంగా, ఏమాత్రం ఆసక్తి కనిపించని గజ్వేల్ లో ఎన్నికలు ఈ స్థాయి సమరానికి దారితీస్తాయని ఎవరూ ఊహించని సంగతి. కాగా, 2009 ముందు వరకు గజ్వేల్ ఎస్సీ రిజర్వుడ్ గా ఉండేది. అప్పట్లోనూ ఇక్కడినుంచి గీతారెడ్డి వంటి నాయకురాలు గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆమె మంత్రి హొదాలో కీలక శాఖలను నిర్వర్తించారు. తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకురాలైన ఈశ్వరీబాయి కూతురిగా, దుబాయ్ లో వైద్యురాలిగా ఉన్న గీతారెడ్డి.. రాజీవ్ గాంధీ కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. తన కార్యక్షేత్రంగా గజ్వేల్ ను ఎంచుకుని పలుసార్లు గెలుపొందారు.
ఆ సెంటిమెంటు..
ముహూర్తాలు, సెంటిమెంట్లు ఎక్కువగా కనిపించే రంగాలు రెండు.. వాటిలో మొదటిది సినిమాలు, కాగా రెండోది రాజకీయాలు. పార్టీలు మేనిఫెస్టో ప్రకటన, అభ్యర్థుల వెల్లడి నుంచి నామినేషన్ దాఖలు, ప్రచార రంగంలోకి దిగడం వరకు అన్నీ వేళలు చూసుకునే చేస్తారు. ఇక సెంటిమెంట్లు కూడా ఇదే స్థాయిలో ఉంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అదే ఒరవడిలో అనేక పథకాలకు చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టారు. కాగా, ఇక కొన్ని నియోజకవర్గాల విషయంలో సెంటిమెంట్లు అధికంగా ఉంటాయి. ఫలానా నియోజకవర్గంలో పర్యటిస్తే పదవి పోతుందని.. ఫలానా నియోజకవర్గంలో గెలిచిన పార్టీనే అధికారంలోకి వస్తుందని వంటి కొన్ని లెక్కలు ఉంటాయి. వాస్తవానికి వీటిని పూర్తి స్థాయిలో కొట్టిపారేయలేం. పూర్తిస్థాయిలో నమ్మలేం.
గజ్వేల్ కూ ఉంది ఆ చరిత్ర
తెలంగాణలో 2014 ముందు వరకు గజ్వేల్ ఓ సాధారణ నియోజకవర్గం. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. 2009లో ఇక్కడినుంచి కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. అయినప్పటికీ గజ్వేల్ పేరు పెద్దగా వినిపించలేదు. అయితే, ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీకి దిగారో అప్పుడు గజ్వేల్ పేరు మార్మోగింది. అందులోనూ తనకు గట్టి పట్టున్న సిద్దిపేటను కాదని కేసీఆర్ 2014లో గజ్వేల్ ను ఎంచుకోవడం సంచలనం రేపింది. ఇక ఆ తర్వాత ఆయన సీఎం కావడంతో గజ్వేల్ దశ తిరిగింది. కాగా, గజ్వేల్ కు ఓ చరిత్ర ఉంది. ఇక్కడినుంచి ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తారో అదే పార్టీ అభ్యర్థి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందట.
ఉమ్మడి ఏపీలో, తెలంగాణలోనూ..
‘‘గజ్వేల్ లో గెలుపు.. రాష్ట్రంలో గెలుపు’’ అనేది ప్రత్యేక తెలంగాణలోనే కాదు. ఉమ్మడి ఏపీలోనూ కొనసాగింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడ్డాక కూడా ఈ సెంటిమెట్ కొనసాగింది. దీంతో దానిపై నమ్మకం మరింత పెరిగింది. ఇక గణాంకాలు చూస్తే.. 1957 నుంచి (1958లో వచ్చిన ఉప ఎన్నిక సహా) 1978 వరకు గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. అప్పట్లో అదొక్క పార్టీనే ఉండేది కాబట్టి.. రాష్ట్రంలో అధికారం దానికే దక్కింది. అయితే, టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ గజ్వేల్ పై జెండా పాతింది. 1983, 1985, 1994, 1999లో గజ్వేల్ లో తెలుగుదేశం పార్టీదే విజయ ఢంకా. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 1989లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. దీనికితగ్గట్లే రాష్ట్రంలో అధికార పీఠం ఆ పార్టీపరమైంది. ఇక 2004, 2009లోనూ గెలిచిన కాంగ్రెస్ పార్టీనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. విశేషం ఏమంటే.. కేసీఆర్ రాకతో గజ్వేల్ లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఆ పార్టీ ప్రభుత్వమూ ఏర్పాటైంది.
కొసమెరుపు: తెలంగాణలో ప్రస్తుతం రెండు నియోజకవర్గాలపైనే అందరి చూపు ఉంది. మొదటిది గజ్వేల్, రెండోది కామారెడ్డి. గజ్వేల్ లో హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న సీఎం కేసీఆర్ పై బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ పోటీకి దిగారు. కాస్త కష్టమే అయినా.. కేసీఆర్ కే గెలుపు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా సాగుతోందని క్షేత్రస్థాయి అంచనాలు చెబుతున్నాయి. ఒకవేళ గజ్వేల్ లో కేసీఆర్ గెలిచినా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే.. సంప్రదాయానికి చెల్లుచీటీనే కదా?