Begin typing your search above and press return to search.

కేంద్రంలో ఎవరిది అధికారం...క్లారిటీ వచ్చేసిందా ?

మార్చి 26న ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఏప్రిల్ 20న తొలి విడతతో మొదలైన పోలింగ్ ప్రక్రియ మే 25తో ఆరు విడతలను పూర్తి చేసుకుంది.

By:  Tupaki Desk   |   26 May 2024 1:30 AM GMT
కేంద్రంలో ఎవరిది అధికారం...క్లారిటీ వచ్చేసిందా ?
X

లోక్ సభకు ఏడు విడతలుగా ఈసారి పోలింగ్ నిర్ణయించారు. అలా ఎన్నికల షెడ్యూల్ ని డిజైన్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మండు వేసవి నెల మేలో వరసగా నాలుగు విడతలు జరిగాయి. మార్చి 26న ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఏప్రిల్ 20న తొలి విడతతో మొదలైన పోలింగ్ ప్రక్రియ మే 25తో ఆరు విడతలను పూర్తి చేసుకుంది.

ఇక మిగిలింది చిట్టచివరిది అయిన ఏడవది. అది జూన్ 1 న జరగనుంది. లోక్ సభకు మొత్తం 543 సీట్లు ఉంటే 486 ఎంపీ సీట్లకు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయింది. ఓటర్లు తీర్పు ఇచ్చేశారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సంబంధించి ఓటర్ల మనసులో ఏముందో ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉంది.

ఇదిలా ఉంటే ఇక మిగిలింది 57 ఎంపీ సీట్లకు మాత్రమే. దేశంలో ఉత్తర భారతం మధ్య భారతం దక్షిణ భారతం, తూర్పు పశ్చిమల్లో అత్యధికం పోలింగ్ పూర్తి అయింది. ఒక విధంగా చెప్పాలీ అంటే పోలింగ్ తొంబై శాతం పూర్తి అయినట్లే.

దాంతో ఎవరిది అధికారం అన్నది ఢిల్లీ స్థాయిలో చర్చ సాగుతోంది. బీజేపీ వరకూ చూస్తే తొలి విడత నుంచి తమకే మెజారిటీ సీట్లు అని చెబుతూ వస్తోంది. మొదటి రెండు విడతలు కలిపి 184 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగితే అందులో వందకు పైగా ఎన్డీయేకు వస్తాయని ఆ పార్టీ నేతలు చెప్పారు.

అయిదు విడతలు పూర్తి అయ్యేసరికి 330 సీట్లకు పైగా తామే గెలవబోతున్నామని కూడా ప్రకటించేశారు. ఇపుడు ఆరవ విడత పూర్తి అయింది.. ఆరో దశ పోలింగ్ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

"2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో దశ పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞలు తెలుపుకుంటున్నాను. పోలింగ్ సాగే కొద్దీ ఎన్డీయేకి లభించే స్థానాల సంఖ్య అంతకంతకు మెరుగవుతోంది. ఇండియా కూటమి అధికారానికి దరిదాపుల్లోకి కూడా రాదన్న విషయం ప్రజలకు అర్థమైంది. ఆ కూటమికి ఓటు వేస్తే వ్యర్థమని గ్రహించారు" అంటూ మోదీ ట్వీట్ చేశారు.

దీనిని బట్టి చూస్తే చాలా కంఫర్టబుల్ గా తామే అత్యధిక శాతం సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు అని అర్ధం అవుతోంది. అదే టైంలో ఇండియా కూటమి కూడా ఏ మాత్రం తగ్గడంలేదు. తమకే ఓటర్ల అదరణ ఉందని చెబుతోంది. తాము కచ్చితంగా విజయం సాధిస్తామని అంటోంది.

అయితే ఈసారి దేశంలో చెప్పుకోదగిన ఎన్నికల అంశాలు ఏవీ లేవు. ఎమోషనల్ ఇష్యూని బీజేపీ మధ్యలో కొన్ని తెచ్చి జనం ముందు పెట్టినా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. మైనారిటీ రిజర్వేషన్లు రద్దుతో పాటు పీవోకేను భారత్ లో కలుపుతామని చెప్పినా వాటికి వచ్చిన స్పందన తక్కువ.

మరో వైపు ఇండియా కూటమి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పెట్రోల్ డీజిల్ వంటివి నింగికి అంటడం, గ్యాస్ ధరలు అధికం కావడంతో పాటు, బాగా పెరిగిన నిరుద్యోగం అభివృద్ధి లేమి వంటి అంశాలతో ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ అయితే దేశాన్ని తాము కలిపి ఉంచుతామని తాము ప్రేమతో దేశాన్ని దగ్గరకు తీస్తామని దేషాన్ని దూరం పెడతామని ప్రచారం చేశారు.

అదే విధంగా ఆకర్షణీయమైన మ్యానిఫేస్టోని ఇండియా కూటమి రిలీజ్ చేసింది. ఉచితాలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ నేపధ్యంలో కామన్ మాన్ సెంట్రిక్ గా ఇండియా కూటమి ప్రచారం సాగింది అని అంటున్నారు. ఎన్డీయే కూటమి దేశాన్ని దాటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ తో పాటు దేశంలో జనాలకు పెద్దగా రీచ్ కానీ ఇష్యూస్ నే పట్టుకుందని అంటున్నారు.

ఇక మధ్యలో మాత్రం యూత్ కోసం పాతిక రోజుల యాక్షన్ ప్లాన్ అని మోడీ చెప్పినా అప్పటికే కొన్ని విడతల పోలింగ్ సాగిపోయింది. మొత్తానికి ఇండియా కూటమి గతం కంటే ఎక్కువగానే ఈసారి ప్రచారం బాగా చేసింది అని అంటున్నారు. ధీమా కూడా విపక్షంలో పెరిగింది అని అంటున్నారు.

ఎన్డీయే కూటమిని ఐక్యంగా ఢీ కొట్టింది. మరి ఫలితాలు ఎలా వస్తాయో తెలియదు కానీ కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఎవరిది వస్తుంది అన్నది ఢిల్లీ స్థాయిలో బిగ్ డిబేట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్లస్ లు మైనస్సులు రెండూ చూస్తుకుంటూ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎండీయే ఇండియా కూటమి రెండూ తమదైన వ్యూహాతోలో నిండా మునిగిపోయాయని అంటున్నారు.