Begin typing your search above and press return to search.

‘ఐదింటి’తో అదరగొట్టాలె.. గులాబీ పార్టీ పోల్ మేనేజ్ మెంట్ ఇదే

అయితే.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మాత్రం సీన్ అనుకున్నంత సింఫుల్ గా లేదన్న విషయాన్ని గులాబీ నేతలు సైతం ఒప్పుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 5:30 AM GMT
‘ఐదింటి’తో అదరగొట్టాలె.. గులాబీ పార్టీ పోల్ మేనేజ్ మెంట్ ఇదే
X

ఏదైనా అనుకుంటేనే జరిగిపోదు. దానికి సంబంధించి పక్కా స్కెచ్ అవసరం. అలాంటిది ఎన్నికలు అంటే మాటలు కాదు. తాజాగా తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉంది. ముందుగా వెలువడిన అంచనాల్ని చూస్తే.. పోటీ పెద్దగా లేదని.. అధికార పార్టీ అధిక్యతను ప్రదర్శించటం ఖాయమని.. గెలుపు ధీమా వ్యక్తమైంది. అయితే.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మాత్రం సీన్ అనుకున్నంత సింఫుల్ గా లేదన్న విషయాన్ని గులాబీ నేతలు సైతం ఒప్పుకుంటున్నారు.

మారిన పరిస్థితుల్ని ఆకళింపు చేసుకున్న గులాబీ బాస్.. తన పోల్ మేనేజ్ మెంట్ లెక్కల్ని మార్చేశారని చెబుతున్నారు. ఇప్పుడున్న పోటీకి తగ్గట్లు పక్కా ప్లాన్ డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఐదు అంశాల్ని అస్త్రాలుగా చేసుకొని పోలింగ్ వేళ అదరగొట్టేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా ముప్ఫై తేదీన జరిగే పోలింగ్ వేళ.. తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునే విషయంలో తాము అనుసరించే వ్యూహమే తమను గెలుపు తీరాలకు తీసుకెళుతుందన్న విషయంపై కేసీఆర్ క్లారిటీగా ఉండటమే కాదు.. అందులో భాగంగా ఐదు అంశాలతో కూడిన ఒక వ్యూహాన్ని సిద్దం చేశారు. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ బయటకు వచ్చింది.

అందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. ప్రతి నియోజకవర్గాన్ని గ్రామాలుగా.. వార్డుల వారీగా ఓటర్లను ఐదు విభాగాలుగా గుర్తించారు. ఏయే వార్డుల్లో ఏయే విభాగానికి ఎన్ని ఓట్లు ఉన్నాయన్న లెక్కను తేల్చారు. దీనికి సంబంధించిన జాబితాను పార్టీ రూపొందించింది. ఈ ఐదు విభాగాలు చూస్తే..

1. బీఆర్ఎస్ కార్యకర్తలు.. అభిమానులు..ప్రభుత్వ పథకాలతో లబ్థి పొంది.. పార్టీకి సానుకూలంగా ఉంటూ కచ్ఛితంగా ఓటు వేస్తారనుకునే వర్గం.

2. పార్టీ అభిమానులైనప్పటికీ.. పథకాల ద్వారా లబ్థి పొందినప్పటికీ.. ఇతర కారణాలతో గుర్రుగా ఉండి.. పార్టీకి ఓటు వేయటానికి సిద్ధంగా లేని వర్గం.

3. ప్రత్యర్థి పార్టీల అభిమానులు..కార్యకర్తలు

4. ఏ పార్టీతో సంబంధం లేకున్నా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న వారు.

5. ఇంకా నిర్ణయం తీసుకోని తటస్థ ఓటర్లు.

ఈ ఐదు విభాగాల్లో ఒకటి మీద ప్రత్యేకంగాఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. వారిని తమతో ఉంచుకోవటం.. అదే సమయంలో మూడో విభాగం వారిని ఎంతలా ప్రయత్నించిన ఫలితం జీరోగా ఉండటంతో వారిని వదిలేయాలి. ఇక.. రెండు.. నాలుగు.. ఐదు విభాగాలకు చెందిన వారి మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయటం.. వారిని ఆకర్షించటమే లక్ష్యం.

ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేయటానికి వీలుగా.. ఈ వర్గాలకు చెందిన ప్రతి వంద మంది ఓటర్లకు నలుగురు ఇన్ ఛార్జులను నియమించారు. ఈ నలుగురూ.. పార్టీకి వ్యతిరేకంగా ఉండే వంద మంది ఓటర్లలో ఒకరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వీరు నిత్యం వారికి కేటాయించిన వంద మందిని లక్ష్యంగా చేసుకొని.. వారిని ఆకర్షించటం.. వారి డిమాండ్లను గుర్తించి.. వారి మనసు మారేలా ప్రయత్నాలు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

కేసీఆర్ సర్కారు అధికారంలోకి వచ్చినంతనే.. ఏమేం చేస్తామన్న విషయంపై అవగాహన కల్పించటంతో పాటు.. పార్టీ పట్ల వారి వైఖరిలో మార్పు వచ్చేందుకు ప్రయత్నించటం. పోలింగ్ కు ముందు మూడు రోజులు వారిని మార్చేందుకు ఉన్న ప్రతి దారిని గుర్తించి.. వారిని తమకు అనుకూల వర్గంగా మారేలా ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. పేపర్ మీద ఉన్న బ్లూ ప్రింట్ అదిరేలా ఉన్నప్పటికీ.. వాస్తవంలో ఇదంతా పక్కాగా జరుగుతుందా? అన్నది ప్రశ్న. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. గులాబీ కారు దూకుడుకు బ్రేకులు వేసే సీన్ ఎవరికి ఉండదనే చెప్పాలి.