Begin typing your search above and press return to search.

జగన్ అందలం ఎక్కిస్తే వెన్నుపోటు పొడిచారు !

విజయవాడ, కర్నూల్ కార్పోరేషన్లలో స్థాయి సంఘం ఎన్నికలు జరిగినా వైసీపీ మొత్తం సీట్లు దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   8 Aug 2024 1:30 AM GMT
జగన్ అందలం ఎక్కిస్తే వెన్నుపోటు పొడిచారు  !
X

విశాఖ నగర పాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు అయింది. దానికి సొంత పార్టీ కార్పోరేటర్లే కారణం. వారే జగన్ కి వైసీపీకి వెన్ను పోటు పొడిచి టీడీపీ కూటమి పంచన చేరారు. వారిని కార్పోరేటర్లుగా చేసి జగన్ అందలం ఎక్కిస్తే వారు చివరికి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశారు. కూటమి ప్రలోభాలకు లొంగి అధికారం వైపునకు మళ్లారు. విజయవాడ, కర్నూల్ కార్పోరేషన్లలో స్థాయి సంఘం ఎన్నికలు జరిగినా వైసీపీ మొత్తం సీట్లు దక్కించుకుంది. కానీ విశాఖలో మాత్రం సీన్ రివర్స్ అయింది.

పైగా విశాఖలో జీవీఎంసీకి ఎన్నికలు పెట్టిందే వైసీపీ. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చినా అయిదేళ్ల పాటు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించలేదు. జీవీఎంసీ పదవీ కాలం 2012లో ముగిసినా 2021 వరకూ అంటే తొమ్మిదేళ్ళ పాటు ఏ పదవీ లేకుండా విశాఖలో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఉండేవారు

టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చాక మొదటి ఆరు నెలలలో ఎన్నికలు పెట్టాలని అనుకుంది. ఇంతలో హుదూద్ తుఫాను రావడంతో అది కాస్తా వెనక్కి పోయింది. ఆ తరువాత అయినా ఎన్నికలు పెట్టాలని అనుకున్నా ఎప్పటికపుడు ఏదో కారణంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక రెండేళ్ళ పాలన తరువాత యాంటీ ఇంకెంబెన్సీ మెల్లగా మొదలు కావడంతో ఆ ఆలోచననే మానుకున్నారు.

అలా టీడీపీ అధికారం నుంచి దిగిపోయేంతవరకూ ఎన్నికలు లేవు. వైసీపీ మాత్రం 2019 మేలో అధికారంలోకి వచ్చాక 2020 ఫిబ్రవరిలోనే లోకల్ బాడీస్ కి ఎన్నికలు ప్రకటించింది. అయితే అప్పట్లో కరోనా మహమ్మారి రావడంతో ఎన్నికలు ఏడాది పాటు వాయిదా పడ్డాయి. అలా 2021 మార్చిలో జీవీఎంసీ కి ఎన్నికలు జరిగాయి. దాంతో పాటు అప్పటికి 70గా ఉన్న వార్డులను 98 దాకా పెంచారు. అలా చాలా మంది నేతలకు అవకాశం వచ్చింది.

పదేళ్ళ పాటు పదవుల కోసం ముఖం వాచిన వారికి ఎన్నికలు పెట్టి కార్పోరేటర్లుగా చాన్స్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. మూడేళ్ళ పాటు జీవీఎంసీలో అధికారం చలాయించి తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలా మంది ప్లేట్ ఫిరాయించి ఆ వైపు వెళ్ళిపోయారు అని వైసీపీ నేతలు అంటున్నారు.

తమ వ్యాపారాలు వ్యవహారాలకు దెబ్బ తగలకూడదనే కూటమి వైపు మళ్ళారని అంటున్నారు. జీవీఎంసీలో పూర్తి మెజారిటీ ఉండి కూడా స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దెబ్బ ఇంతటితో ఆగదని మేయర్ పీఠాన్ని కూడా కదిలించి వేస్తుందని అంటున్నారు.

మేయర్ పీఠం కైవశం చేసుకోవడం కూడా సులువే అన్నది స్థాయి సంఘం ఎన్నికలలో గణాంకాలు తెలియచేస్తున్నాయని అంటున్నారు. ఒక విధంగా స్థాయి ఓటమితో నైతికంగా వైసీపీ జీవీఎంసీలో షాక్ తిన్నట్లు అయింది అని అంటున్నారు. జీవీఎంసీలో పాలన అంతా స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అలా ఎంతో కీలకమైన స్థానాన్ని కూటమి కైవశం చేసుకున్న తరువాత మేయర్ పదవి లో ఉన్న వారు ఎవరైనా ఉత్సవ విగ్రహమే అవుతారని అంటున్నారు. రేపో మాపో ఆ ముచ్చట కూడా తీర్చేసుకుని మేయర్ పీఠాన్ని సాఇతం అధిరోహించడానికి టీడీపీ కూటమి సిద్ధంగా ఉంటుందని కూడా ప్రచారం సాగుతోంది.