Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కుపై వెనక్కు తగ్గిన మోడీ.. ప్రైవేటీకరణ పెండింగ్

విశాఖ ఉక్కు నిర్వహణ కోసం కేంద్రం రూ.3 వేల కోట్ల ఆర్థికసాయాన్ని మంజూరు చేయనుందని చెప్పారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 5:37 AM GMT
విశాఖ ఉక్కుపై వెనక్కు తగ్గిన మోడీ.. ప్రైవేటీకరణ పెండింగ్
X

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినదించి.. సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆ మధ్యలో మోడీ సర్కారు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయటం.. ఆ ప్రయత్నాల్ని అడ్డుకోవటానికి పోరాటాలు చేసినా ఫలితం లేని పరిస్థితి. మొత్తంగా ప్రైవేటీకరణ విషయంలో మోడీ సర్కారు దూకుడుకు తాజాగా బ్రేకులు పడిన వైనాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం పెండింగ్ లో ఉందని.. ఆ ఫైల్ మీద ఎలాంటి కదలిక లేదని.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదన్న కీలక అంశాన్ని వెల్లడించారు.

కేంద్రంలోని మోడీసర్కారు విధాన నిర్ణయంతో వైజాగ్ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయాలన్న అంశం తెర మీదకు వచ్చినప్పటికీ.. ఆ అంశం ముందుకు కదలకపోవటానికి కారణం.. విశాఖ ఉక్కును కొనుగోలు చేసే పెద్ద సంస్థలు లేకపోవటమే. ఈ విషయాన్నీ కిషన్ రెడ్డి వెల్లడించారు. విశాఖఉక్కు నిర్వహణ కోసం కేంద్రం రూ.3వేల కోట్ల ఆర్థికసాయాన్ని మంజూరు చేయనుందని చెప్పారు.

వైజాగ్ స్టీల్ క్యాప్టివ్ మైన్స్ కేటాయింపుపైనా ఆయన స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు.. ఇనుప ఖనిజాలు కేటాయించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని.. దానిపై తాను ఇంకా రివ్యూ చేయలేదన్న కిషన్ రెడ్డి.. ‘‘ఉక్కు శాఖ, వైజాగ్ స్టీల్ తో పాటు మా మంత్రిత్వ శాఖలతో మాట్లాడతా. అందుకు ఉన్న అవకాశం మీద చర్చిస్తా’’ అని చెప్పారు. తనకు తెలిసినంత వరకు వైజాగ్ స్టీల్ కూడా వేలంలో పాల్గొని గనులను సొంతం చేసుకోవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రానికే కావటంతో దాని నిర్మాణం పూర్తి చేయటానికి మోడీ సర్కారు తప్పకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.