Begin typing your search above and press return to search.

జైలులో బాబు...లైవ్ లో జగన్...మహా కుట్ర అంటూ నివేదిక ?

కానీ ఈ రెండింటినీ తోసిపుచ్చుతూ బాబు ఏకంగా 53 రోజుల పాటు జైలులో గడిపారు.

By:  Tupaki Desk   |   21 Nov 2024 3:52 AM GMT
జైలులో బాబు...లైవ్ లో జగన్...మహా కుట్ర అంటూ నివేదిక ?
X

సరిగ్గా ఏడాది క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు జైలు పాలు అయ్యారు. ఆయన అసలు జైలుకు పోరు అన్నది ఒక బలమైన నమ్మకం అందరికీ ఉంది. ఒకవేళ కర్మం చాలక వెళ్ళినా ఇలా బెయిల్ మీద వచ్చేస్తారు అన్నది కూడా గాఢ నమ్మకమే. కానీ ఈ రెండింటినీ తోసిపుచ్చుతూ బాబు ఏకంగా 53 రోజుల పాటు జైలులో గడిపారు.

దాంతో వైసీపీ అధినాయకత్వం అనుకున్నది సాధించామని భావించిందా అన్నది పక్కన పెడితే తగిన భారీ మూల్యం 2024 ఎన్నికల్లో చెల్లించుకుంది. ఇక బాబు జైలు గోడల మధ్యన 53 రోజులు గడిపితే దానిని అనుక్షణం లైవ్ లో చూస్తూ జగన్ ఆనందించారని ఒక టీడీపీ అనుకూల టీవీ మీడియాలో డిబేట్ నడచింది. దాని మీద విచారణ జరిపించాలంటూ డిమాండ్ కూడా వస్తోంది.

ఇంతకీ అసలు ఏమి జరిగింది అన్నది చూస్తే కనుక స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ గత ఏడాది సెప్టెంబర్ 9న జరిగింది. అయితే ఆనాడు బాబు జైలు జీవితం గడిపిన దానిని నాటి సీఎం జగన్ ప్రత్యక్షంగా చూసి సంతోషించారు అంటూ ఒక టీవీ చానల్ చెప్పడమే కాదు అందుకు తగిన ఆధారాలు తమకు దొరికాయని కూడా చెబుతోంది. దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని కూడా కోరుతోంది.

ఇక మాజీ సీఎం జగన్‌కు అప్పట్లో నలుగురు పోలీసు అధికారులు, ఒక రాజకీయ నాయకుడితో కూడిన బృందం ప్రతి ఆదివారం జైలులో చంద్రబాబు కార్యకలాపాలను వివరించేవారని కూడా ఆ టీవీ చానల్ కి అందిన నివేదికలో పేర్కొన్నారట. అంతే కాదు, జైలులో చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలను కూడా ఎప్పటికపుడు వీక్షిస్తూ జగన్ ఆనందించారని, లైవ్ ఫుటేజీని కూడా వీక్షించారని ఆ నివేదిక పేర్కొంది.

అంతే కాదు, చంద్రబాబు-పవన్ కళ్యాణ్, చంద్రబాబు-భువనేశ్వరి-లోకేష్-బ్రహ్మణి తదితరుల సంభాషణలు కూడా రాజమండ్రి జైలులో ఉన్న కొందరు పోలీసు అధికారులు ఎప్పటికపుడు జగన్‌కు లీక్ చేశారని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారుట.

ఇక చంద్రబాబు జైలుశిక్షకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపైన కూడా అప్పట్లో ప్రతి శనివారం జగన్‌తో పోలీసు అధికారుల సమావేశం జరిగేదని అలా ఆనాటి సీఎంకు జైలు ఆవరణలో ఏం జరుగుతుందో వివరించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసేవారని కూడా నివేదికలో వెల్లడి చేశారట రు. మరి ఈ ఆరోపణల మీద అలా వచ్చిన నివెదికను ఆసరగా చేసుకుని విచారణ జరిపించాలని కోరుతున్న వారూ ఉన్నారు. ఏకంగా ఈ వ్యవహారంపై సీఐడీ విచారణ జరపాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

మరో వైపు నెల్లూరు రూరల్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రికి లేఖ కూడా రాసారు. వైసీపీ హయాంలో చంద్రబాబు మీద మహా కుట్ర జరిగిందని దానిని మీద విచారణ జరిపించాలని ఆయన కోరారు. బాబు పైన ఆనాటి వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులను పెట్టిందని ఆయనను 53 రోజుల పాటు జైలులో ఉంచిందని ఇది కచ్చితంగా కుట్ర అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కూడా చెప్పారు. ముఖ్యమంత్రి ఆఫీసులో మద్దతు ఉంటేనే తప్ప ఈ కుట్ర జరగడం అసాధ్యమని కూడా అంటున్నారు. దీనిపైన విచరణ చేయాలని డీజీపీకి లేఖ రాశానని ఆయన అంటున్నారు.

మొత్తం మీద చూస్తే ఏపీలో వైసీపీ నేతల మీద వరస కేసులు పడుతున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇపుడు ఈ మహా కుట్ర మీద జగన్ పైన కూడా కేసులు పెడతారా అన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలే నమోదు అవుతాయని అంటున్నారు.