Begin typing your search above and press return to search.

ఆవు నెయ్యి-అస‌లు వాస్త‌వాలు.. తట్టుకోవ‌డం క‌ష్ట‌మే.. !

ఈ క్ర‌మంలోనే తమిళనాడుకి చెందిన ఏ ఆర్ ఇండస్ట్రీస్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

By:  Tupaki Desk   |   27 Sep 2024 5:19 AM GMT
ఆవు నెయ్యి-అస‌లు వాస్త‌వాలు.. తట్టుకోవ‌డం క‌ష్ట‌మే.. !
X

తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో గడిచిన వారం రోజులుగా తీవ్ర వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దీనికి కారణాలు ఏంటి? ఎలా? అనేది ఇప్పటికి అంతుచిక్క‌లేదు. ఉద్దేశపూర్వకంగానే ఇతర జంతువుల కొవ్వు కలిపారనేది ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే కల్తీ చేశాయని వాటిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పారు. ఈ క్ర‌మంలోనే తమిళనాడుకి చెందిన ఏ ఆర్ ఇండస్ట్రీస్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అసలు ఆవు నెయ్యి కల్తీ అనేది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ప్రక్రియ కాదు. దీనికి ప్రధాన కారణం ఆవులకు వినియోగించే ఆహారమే కల్తీ అవుతోంది. ఇది ప్రధానమైన విషయం. మిగిలిపోయిన బిర్యానిలు, కుళ్ళిపోయిన మాంసం, అదేవిధంగా జంతువుల కళేబరాలు, మాంసం షాపుల్లో మిగిలిపోయిన సరుకు వంటి వాటిని కలిపి ఆహారంగా పెడుతుండటం ప్ర‌ధాన‌ సమస్య. ఈ విషయం గడిచిన కొన్ని సంవత్సరాలుగా వార్తల్లోకి వస్తూనే ఉంది.

పశువులకు వేసే ఆహారంలో జంతువులు కళేబరాలు, మాంసకృతులు ఉంటున్నాయని, అలాగే మిగిలిపోయిన బిర్యాని, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు వాటికి పెడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయం. వీటిని తిన్న ఆవులు లేదా పశువులు సహజంగానే అనారోగ్యానికి గురికావడం లేదా వాటి ఉత్పత్తుల్లో అవి మళితం కావడం అనేది జరుగుతుంది. ఇదే ప్రధాన సమస్యగా మారిందనేది జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి స్పష్టమవుతుంది.

నిజానికి పశువులకు పెట్టే ఆహారం ఏదైనా కూడా జంతు సంబంధానికి దూరంగా ఉండాలి. కానీ, చికెన్ షాపులు, మటన్ షాపుల నుంచి వచ్చే వాటితో మిళితమైన కుడితిని వినియోగిస్తుండడంతో ఈ ప్రభావం కనిపిస్తోందన్నది జాతీయ మీడియాలో జరుగుతున్న చర్చ. ఈ సమస్య ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కువగానే ఉంది. మిగిలిపోయిన వ్యర్ధాలను తక్కువ ధరకు విక్రయించి తద్వారా ఎంతో కొంత సొమ్మును చేసుకోవాలనే ఆలోచన వ్యాపారస్తులకు ఉండడంతో ఈ పరిణామం సంభవిస్తుంది.

గడ్డి అందుబాటు ధరలో లేకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో తక్కువ ధరకు ఏది దొరికితే దాన్ని తీసుకొచ్చి ఆవులకు ఆహారంగా వేస్తుండటం సహజంగా మారిపోయింది. ఈ కారణంగానే ఆవు నెయ్యి కల్తీ అవుతుందన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అలాగని ఇది పూర్తి వాస్తవమా కాదా లేకపోతే ఇలాగే జరుగుతుందా అనేది చెప్పడం కష్టమే. అయినా జరుగుతున్న పరిణామాలు, వస్తున్న వార్తలను బట్టి మాత్రం దీనికి కూడా అవకాశం ఉందనేది విశ్లేషకులు మాట. మరి తిరుమల లడ్డు విషయంలో ఏం జ‌రిగింది అనేది చూడాలి.