Begin typing your search above and press return to search.

కేసీఅర్ జగన్ ఒకేసారి వస్తారట !

ఇక కేసీఆర్ కి జగన్ కి మధ్య వయసులో గ్యాప్ ఉన్నా రాజకీయం చేసే విషయంలో మాత్రం పోలికలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   16 Nov 2024 1:30 AM GMT
కేసీఅర్ జగన్ ఒకేసారి వస్తారట !
X

రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినా రాజకీయాలు మాత్రం ఒకేలా సాగుతూంటాయి. తెలంగాణాలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి చతికిలపడింది. ఇక్కడ ఏపీలో వైసీపీ కూడా డిటోగా ఉంది. ఇక కేసీఆర్ కి జగన్ కి మధ్య వయసులో గ్యాప్ ఉన్నా రాజకీయం చేసే విషయంలో మాత్రం పోలికలు ఉన్నాయి.

ఇద్దరూ గుమ్మం దాటకుండానే అయిదేళ్లూ పాలించారు అని పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ ప్రజల నాడిని పసిగట్టినట్లుగా భావించి చివరికి ఫలితాల వద్ద ఖంగు తిన్నారని చెబుతారు. కేసీఆర్ అతి నమ్మకం మీద మొత్తం సిట్టింగులకు టికెట్లు ఇచ్చి ఓటమిని కొని తెచ్చుకుంటే జగన్ తన మీద అతి నమ్మకంతో సీట్లు మార్చేసి జంబ్లింగ్ విధానంలో ఎన్నికలకు వెళ్ళారు. ఇద్దరికీ ఫలితం మాత్రం డిటోగానే వచ్చింది.

ఇక ఓడాక కేసీఅర్ ఫార్మ్ హౌస్ కి పరిమితం అయ్యారని విమర్శలు ఉన్నాయి. జగన్ అయితే తాడేపల్లి టూ బెంగళూరు అన్నట్లుగా ప్రచారంలో ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడాది అవుతోంది. ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చి ఆరు నెలలకు దగ్గర పడుతోంది.

ఇదిలా ఉంటే ఈ ఇద్దరు నేతలు మంచి ముహూర్తం చూసుకుని జనంలోకి రావాలని అనుకుంటున్నారు. అందుకు కొత్త ఏడాది జనవరిని వారు ఎంపిక చేసుకున్నారు అని అంటున్నారు. 2025 లో సంక్రాంతి దాటిన తరువాత కేసీఆర్ జనంలోకి వస్తారని మొత్తం బీఆర్ఎస్ రాజకీయమే గేర్ మారుస్తారు అని ఆ పార్టీ నేతలు అంటున్నారు అప్పటికి ఏడాది పై దాటిన కాంగ్రెస్ పాలన మీద జనంలో వ్యతిరేకత కనిపిస్తుందని దానిని ఎగదోయడం ద్వారా గులాబీ తోటలో పూవులు పూయించేందుకు గులాబీ బాస్ రెడీ అవుతారు అని అంటున్నారు.

కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని ఎండగట్టడానికి తన దగ్గర దండిగా పాయింట్స్ ఎన్నో పెట్టుకునే కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు. ఏడాది పాటు ఫాం హౌస్ లో ఉన్నా కేసీఆర్ అపర చాణక్యం ఆయన ఎత్తులు మరింత రాటు దేలి ఉంటాయని ఇక తట్టుకోవడం కష్టమే అని బీఆర్ఎస్ వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తూ అంటున్నాయి.

అదే విధంగా ఏపీలో చూస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతుంది. గ్రౌండ్ లెవెల్ లో పధకాల మీద జనాలలో ఆశలు ఉన్నాయి. సూపర్ సిక్స్ హామీలలో ఇంకా టీడీపీ కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది.

దాంతో వాటిని పట్టుకుని జగన్ జనంలోకి వెళ్తే బ్రహ్మరధమే పడతారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక్కసారి జగన్ జనంలోకి రావాలే కానీ ప్రజా దరణ విషయంలో తిరుగు ఉండదని అంటున్నారు. దాంతో జగన్ కూటమి ప్రభుత్వం మీద తనదైన పోరాటాన్ని కొత్త ఏడాది మొదలెడుతున్నారు అని అంటున్నారు.

ఈ సందర్భంగా జగన్ జిల్లాల వారీగా పర్యటనలు చేస్తారు అని అంటున్నారు ఒక వైపు క్యాడర్ తోనూ మరో వైపు పార్టీ నేతలతోనూ మీటింగ్స్ పెడుతూనే ఇంకో వైపు జనాలతో సభలు నిర్వహిస్తారని అంటునారు. ఒక నిర్దిష్ట కాల పరిమితి పెట్టుకుని ఏపీలోని మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలను జగన్ ఒక రౌండ్ పూర్తి చేస్తారు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే అటు కేసీఆర్ ఇటు జగన్ కూడబలుక్కున్నట్లుగానే అధికార పార్టీల మీద తమదైన శైలిలో సమరం సాగిందేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. దాంతో కొత్త ఏడాది నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయం రక్తి కడుతుందని అంటున్నారు.