ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం... గుంటూరులో యూదుల రియాక్షన్ ఇదే!
అవును... సుమారు 5,000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఇజ్రాయేల్ లో భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 17 Oct 2023 7:01 AM GMTఇజ్రాయేల్ - హమాస్ మధ్య గత పదిరోజులుగా భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో భాగంగా... ఇజ్రాయెల్ దాడుల్లో మొత్తం 2,750 మంది మరణించారని.. 9,700 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోపక్క హమాస్ దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెలీలు మరణించగా.. 199 మంది బందీలుగా ఉన్నారనీ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న యూదులు రియాక్ట్ అయ్యారు!
అవును... సుమారు 5,000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ఇజ్రాయేల్ లో భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వందల ఏళ్ల క్రితం ఏపీకి వలసవచ్చి ఇక్కడ స్థిరపడిన యూదులు తాజాగా ఈ యుద్ధంపై రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు.. ఎందుకు వచ్చారు.. మళ్లీ ఇజ్రాయేల్ ఎప్పుడు వెళ్తారు.. ఆ విషయంలో వీరి ఆలోచన ఏమిటి మొదలైన విషయాలు పంచుకున్నారు!
గత పదిరోజులుగా ఇజ్రాయేల్ – హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెల్లిసిందే. ఈ సమయంలో ఆ యుద్ధం ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోనూ కనిపిస్తోంది. ఇక్కడ.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండల కేంద్రానికి చెందిన కొత్తరెడ్డిపాలెంలోని కొన్ని కుటుంబాలు తమ పండుగలు రద్దు చేసుకున్నాయి. కారణం... తామంతా యూదులమని, ఇజ్రాయేల్ నుంచి వలసవచ్చిన జాతి అని చెబుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఇజ్రాయెల్ నుంచి 300 ఏళ్ల క్రితం యూదులు వివిధ ప్రాంతాలకు వలస వచ్చారని.. అలా తమ పూర్వీకులు కూడా వచ్చారని.. వారు తొలుత తెలంగాణ ప్రాంతానికి, ఆ తర్వాత అమరావతికి వచ్చారని.. ఉపయోగించిన అనేక వస్తువులు ఇప్పటికీ అమరావతి మ్యూజియంలో భద్రపరచి ఉన్నాయని చెబుతున్నారు గుంటూరు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు!
గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో వందేళ్ల క్రితం నుంచే తమ కుటుంబీకులు నివపిస్తున్నట్టు చెబుతున్న 40 కుటుంబాలకు చెందిన వారు... కొత్తరెడ్డిపాలెంలో ఉన్న యూదులు మొత్తం 40 కుటుంబాలు ఉన్నాయని. మొత్తం జనాబా సుమారు 250 ఉంటుందని చెబుతున్నారు. వీరిలో చాలా మందికి హీబ్రూ రాయడం, చదవడం, మాట్లాడడం తెలుసని అంటున్నారు.
ఇక తమకు ఈ దేశంలో యూదులుగా గుర్తింపు ఇవ్వాలని గతంలోనే ప్రభుత్వాలకు నివేదించినప్పటికీ ఫలితం దక్కలేదని వీరు చెబుతున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశించినప్పటికీ ఫలితం దక్కలేదని.. కానీ మణిపూర్, మిజోరం ప్రాంతాల వాసులు మాత్రం అక్కడికి వెళ్లారని చెబుతున్నారు.
ఇక విడిపోయిన సభ్యులందరూ ఇజ్రాయెల్ కు తిరిగి రావాలని పవిత్ర గ్రంథమైన తోరాలో రాసుందని చెబుతున్న వీరు... అందుకు తగ్గట్టుగా ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన యూదు ప్రజలు తిరిగి వచ్చేలా ఇజ్రాయేల్ లో ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మణిపుర్ నుంచి 3,000 మంది యూదులు గతంలో ఇజ్రాయెల్ వెళ్లారని వీరు చెబుతున్నారు.
అయితే ఈ గుంటూరులో యూదులుగా చెబుతున్న కుటుంబాల వారి బ్లడ్ శాంపుల్స్ ని హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) గతంలోనే పరిశీలించింది. ఈ మేరకు... 2014లోనే వారికి డీఎన్ఏ పరీక్షలు జరిపినట్టు స్థానిక రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ పరీక్షల్లో వారి మూలాలు భారతీయులకు భిన్నంగా ఉన్నట్టు నిర్థారించారని అంటున్నారు.
ఈ క్రమంలో... కొన్నేళ్ల క్రితమే ఇజ్రాయెల్ నుంచి రబ్బీస్ అని పిలిచే యూదు మత పెద్దలు కొత్తరెడ్డిపాలెం వచ్చి అక్కడి స్థానికుల వివరాలు కూడా సేకరించారట. యూదులుగా గుర్తింపు లభిస్తే ఇజ్రాయెల్ నుంచి వారికి సహకారం ఉంటుందని తేల్చారట. దీంతో... త్వరలోనే పరిస్థితులన్నీ సద్దుమణిగి తిరిగి ఇజ్రాయెల్ లో సాధారణ పరిస్థితులు రావాలని తామంతా ప్రార్థనలు చేస్తున్నట్టు చెబుతున్నారు కొత్తరెడ్డిపాలెంలో ఉంటున్న యూదులు!