ఆ రెండు పార్టీలకు అధిష్టానాలతోనే అసలు ముప్పు.. బీఆర్ ఎస్‌కు కలిసి వస్తోంది ఇదే!
స్థానికంగా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోవడం.. కనీసం స్థానిక సమస్యలపైనా దృష్టి పెట్టి దానికి అనుగుణంగా ప్రజలకు హామీలిచ్చే చాన్స్ లేకుండా పోవడం వంటివి ఇటు నాయకుల్లోనూ.. అటు ప్రజల్లోనూ కూడా చర్చనీయాంశం అయింది.
By: Tupaki Desk | 2 Nov 2023 4:14 AM GMT''మన పార్టీలో చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. ఏం చేద్దాం''- బీజేపీ నేతల టాక్. దీనికి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి చెబుతున్న మాట.. ''అంతా అధిష్టానమే చూసుకుంటుంది'' అని!
''ఆరు గ్యారెంటీలు సరే..అసలు ప్రజలు కోరుతన్నవి కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మేనిఫెస్టోలో చేర్పించండి''- కొందరు కాంగ్రెస్ కీలక నేతల మాట. దీనికి పీసీసీ చీఫ్ చెబుతున్న మాట.. ''అంతా అధిష్టానమే చూసుకుంటుంది'' అని!
కట్ చేస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ఏ నాయకుడిని దారిలో పెట్టుకోవాలన్నా.. ఏ నాయకుడు చేజారకుండా చూసుకోవాలన్నా.. ప్రజలకు అవసరమైన హామీలను ఇవ్వాలన్నా.. నాయకులకు టికెట్ల విషయంలో హామీలు గుప్పించాలన్నా.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లో ప్రముఖంగా వినిపిస్తున్న మాట.. 'అధిష్టానం-అధిష్టానం-అధిష్టానం'.
ఇది తప్ప.. తక్షణ నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం కానీ.. మంత్రాంగం కానీ ఈ రెండు పార్టీల్లోనూ కనిపించడం లేదు. దీంతో స్థానిక ఎన్నికల్లో(అసెంబ్లీ) తక్షణ నిర్ణయాలు.. పాలన.. వంటి కీలక అంశాలపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేవారు కావాలని కోరుతున్న తెలంగాణ సమాజానికి ఈ రెండు పార్టీలు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నా రు.
ఇటీవల ఈ రెండు పార్టీల్లోనూ జరిగిన పరిణామాలను గమనిస్తే.. 'అధిష్టానం' ప్రభావమే కనిపిస్తోంది. చాలా మంది నాయకులు కనీసం తమ వాదన చెప్పుకొనే అవకాశం కూడా లేకుండా చేశారని.. కాంగ్రెస్, బీజేపీల్లో విమర్శలు వచ్చాయి. స్థానికంగా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోవడం.. కనీసం స్థానిక సమస్యలపైనా దృష్టి పెట్టి దానికి అనుగుణంగా ప్రజలకు హామీలిచ్చే చాన్స్ లేకుండా పోవడం వంటివి ఇటు నాయకుల్లోనూ.. అటు ప్రజల్లోనూ కూడా చర్చనీయాంశం అయింది.
బీఆర్ ఎస్ కు ఇదే కలిసివస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ప్రజలను ఏదో ఒక సెంటిమెంటుతో తనవైపు తిప్పుకోవాలని భావించే కేసీఆర్.. 2018 టీడీపీ-కాంగ్రెస్‌లను బూచిగా చూపించి.. ఆంధ్రోళ్ల పెత్తనం అంటూ ఓట్లు పిండుకున్నారనే వాదన ఉంది.
ఇక, ఇప్పుడు ఈ విమర్శలకు, సెంటిమెంటుకు అవకాశం లేకుండా పోవడంతో.. ''మన నేలపై మనం నిర్ణయాలు తీసుకుందమా.. మన నేల గురించి ఢిల్లీ వోళ్లు చెప్పింది చేస్తమా? ఢిల్లీలో తీసుకునే నిర్ణయాలు మన నెత్తిన రుద్దేటోళ్లు మనకు అవసరమా?'' అంటూ ఆయన కొత్త వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. నిజానికి కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి కూడా అలానే ఉండడంతో కేసీఆర్ వాదనను తప్పు బట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆ రెండు పార్టీలకూ ఇప్పుడు అధిష్టానాలే అతి పెద్ద సమస్యగా మారాయని అంటున్నారు పరిశీలకులు.