ఎన్నికలు 'ఏపీ'వైనా కరుణించాల్సింది 'తమిళ'తంబీలే
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో తమిళ వాసనలు ఎక్కువే. ఉమ్మడి
By: Tupaki Desk | 13 May 2024 12:43 PM GMTఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో తమిళ వాసనలు ఎక్కువే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగరి, జీడీ నెల్లూరు, సత్యవేడు, తిరుపతి నియోజక వర్గాల గెలుపు ఓటములలో ప్రధానపాత్ర తమిళుతంబీలదే. వారు కరుణిస్తేనే అభ్యర్థుల విజయం సాధ్యం అవుతుంది.
తమిళనాడు సరిహద్దులలో ఉన్న చిత్తూరు జిల్లా నుండి లక్షలాది మంది జీవనరీత్యా వివిద కారణాలతో చెన్నైతో పాటు వేలూరు, కోయంబత్తూరు. ఆంబూరు, సేలం, క్రిష్ణగిరి, హోసూరు తదితర ప్రాంతాలలో తమిళనాడులో నివాసం ఉంటున్నారు. అక్కడ ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు చేస్తున్నారు. కానీ వీరి ఓట్లు మాత్రం తమ తమ స్వంత ఊర్ల లోనే ఉంచుకున్నారు.
నగరి నియోజకవర్గంలో దాదాపు 55 వేల మంది తమిళ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మంత్రి, సినీ నటి ఆర్.కె రోజా ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ఈ సారి కూడా గెలవాలని తీవ్రంగా శ్రమిస్తున్నది. రెండు సార్లు తమిళుల ఓట్లనే నమ్ముకున్న రోజా మరోసారి వారి ఆశీస్సులనే కోరుతున్నది. నగిరి, పుత్తూరు మునిసిపాలిటితో పాటు విజయపురంలోనే 55 వేల మంది తమిళ ఓటర్లు ఉన్నారు. ప్రచారంలో రోజాతో పాటు ఆమె భర్త ఆర్.కె.సెల్వమణి కూడా పూర్తిగా తమిళంలోనే ప్రచారం చేస్తున్నాడు.
వరసగా ఆరు సార్లు విజయం సాధించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో కూడా 20 వేల పైచిలుకు తమిళ ఓటర్లు ఉన్నారు. ఇటీవల నగరి ప్రచారంలో చంద్రబాబు కూడా అక్కడక్కడా తమిళ భాషలో మాట్లాడడం విశేషం. సత్యవేడు నియోజకవర్గంలో 65 వేల మంది, చిత్తూరులో 75 వేల మంది, జీడి నెల్లూరులో 55 వేల మంది తమిళ ఓటర్లు ఉండడం విశేషం. ఆయా నియోజకవర్గాలలో తమిళతంబీలు అండగా నిలిస్తేనే అభ్యర్థుల విజయం సాధ్యం అవుతుంది.