తెలంగాణ గీతం ఒకటి కాదు.. రెండు!.. యువ గళాల్లో కోటి రతనాల శోభ!!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 1 Jun 2024 12:40 PM GMT''నా తెలంగాణ కోటి రతనాల వీణ''- అన్నారు దాశరథి రంగాచార్యులు. ఈ కోటి రతనాలు ఇప్పుడు యువ గళాల్లో పారుతూ.. తెలంగాణ అశేష సమాజాన్నీ అలరించేందుకు ముందుకు రానున్నాయి. దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి సంగీత కూర్పులో.. ప్రజాకవి అందెశ్రీ రాసిన గేయం మరికొన్ని గంటల్లో ప్రజల ముందుకు రానుంది. వీనుల విందు చేయనుంది. జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఈ గీతాన్ని విడుదల చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలో తెలంగాణ జాతీయ గీతానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నపాటి విమర్శలు.. మరికొన్ని ఆగ్రహాలు వ్యక్తమైనా.. గీతం రసవత్తరంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో ఆయన వాటిని పక్కన పెట్టి మరీ సంగీత దర్శకత్వ బాధ్యతలను కీరవాణికే అప్పగించారు. ఇక, ఆయన గురించి చెప్పుకోవడం అంటే.. ముంజేతి కంకణం గురించి వర్ణించడమే అవుతుంది. ఇక, అందెశ్రీ.. ప్రజాకవి.. సామాన్యుడి జీవితాన్ని.. తెలంగాణ చారిత్రక ఘట్టాలను అలతి అలతి పదాలతో తెలంగాణ యాసను కలిపి.. రంగరించిన నేటి తరం మహాకవి. ఆయన కలం నుంచి జాలువారిన ఈ గీతం .. జూన్ 2న అధికారికంగా ప్రజల ముందుకు రానుంది.
ఇక, ఇప్పటి వరకు చెప్పుకొంటున్నట్టు తెలంగాణ జాతీయ గీతం కేవలం రెండు నిమిషాలు.. ఒకటిన్నర నిమిషాలు కాదు.. ఏకంగా 13 నిమిషాలకు పైగానే కంపోజ్ చేశారు. బలమైన తెలంగాణ సాహిత్యాన్ని పొదిగిన ఈ గీతం.. 13.30 నిమిషాలుగా తీర్చిదిద్దారు. అయితే.. ఇంత పెద్ద గీతం ఒక్కటే ఉంటే బాగుండదనే ఉద్దేశంతో దీనిని రెండుగా విభజించారు. 2.30 నిమిషాల నిడివితో అసలు గీతం నుంచి కొన్ని చరణాలు కూర్చి.. ఈ రెండో గీతం సిద్ధం చేశారు. జయజయహే తెలంగాణ చరణంతో ప్రారంభమయ్యే ఈ రెండు గీతాలను కూడా అధికారిక గీతాలుగానే ప్రభుత్వం ప్రకటించింది.
ఇక, ఈ గీతానికి యువగళాలు తేనెలూరించారు. యువ సంగీత కళాకారులు.. గాయకులు.. రేవంత్, హారికా నారాయణ్ ఆలపించారు. వీరికి కోరస్‌గా మరో పది మంది యువ గాయకులు గళం కలిపారు. జూన్ 2న ఆవిష్కరణకు సిద్ధమైన ఈ గీతానికి కృషి చేసిన అందరినీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అభినందించారు. ఈ సందర్భంగా హారియా నారాయణ్ మాట్లాడుతూ.. తనకు తెలంగాణ జాతీయ గీతం ఆలపించే అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కీరవాణి.. కవి అందెశ్రీలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.