Begin typing your search above and press return to search.

జీవన్ రెడ్డి మౌనం వెనక మతలబేంటి ?!

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన కాంగ్రెస్ తరపున చట్టసభలో ప్రధాన గొంతుకగా వ్యవహరించాడు.

By:  Tupaki Desk   |   13 Aug 2024 10:30 AM GMT
జీవన్ రెడ్డి మౌనం వెనక మతలబేంటి ?!
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి నిరంతరం ఏదో ఒక అంశం మీద మాట్లాడుతూ వార్తల్లో వ్యక్తిగా ఉంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన కాంగ్రెస్ తరపున చట్టసభలో ప్రధాన గొంతుకగా వ్యవహరించాడు. గత ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశాడు.

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఈ చేరికకు సంబంధించి స్థానికుడు, సీనియర్ కాంగ్రెస్ నేత అయిన జీవన్ రెడ్డికి కనీస సమాచారం లేకపోవడంతో ఆయన ఆగ్రహించారు. ఈ విషయం ఢిల్లీ అధిష్టానం వరకు వెళ్లింది. సీఎం రేవంత్ స్వయంగా ఢిల్లీలో జీవన్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని మీడియా సమావేశంలో పొరపాటును ఒప్పుకున్నాడు.

అయినా ఇప్పటి వరకు ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ముఖాముఖి కలుసుకోలేదు. నియోజకవర్గంలో ఫ్లెక్సీలలో కూడా ఫోటోలు వేసుకోవడం లేదు. దీని మీద వివాదాలు కూడా చెలరేగాయి. అయితే జగిత్యాలకు సంబంధించిన కొన్ని పనుల విషయంలో జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎమ్మెల్యే చెప్పిన పనులు అయినా, ఎమ్మెల్సీ పనులు మాత్రం కాలేదు.

ఇక నామినేటెడ్ పదవుల విషయంలో కాంగ్రెస్ నేతల పేర్లను జీవన్ రెడ్డి సిఫారసు చేశారు. అయితే వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే సంజయ్ కూడా పార్టీలోని సీనియర్ నేతల పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేశాడు. దీంతో జీవన్ రెడ్డి గత 15 రోజులుగా మౌనదీక్ష చేస్తున్నారు. సీనియర్ నేత అయిన తన పేర్లకు ప్రాధాన్యం ఇస్తుందా ? కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే పేర్లకు ప్రాధాన్యం ఇస్తుందా ? అని వేచిచూస్తున్నట్లు సమాచారం. తన ప్రతిపాదనలకు ప్రాధాన్యం దక్కకుంటే తీవ్ర నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.