Begin typing your search above and press return to search.

హిందూయిజం కాదు.. హిందూత్వం.. పేరు మార్పు వెనుక పెద్ద కథే

ఈ నేపథ్యంలో హిందూయిజం కాదు.. ఇకపై ‘‘హిందూత్వ’’ అని సంబోధించాలని తీర్మానించారు

By:  Tupaki Desk   |   25 Nov 2023 8:05 AM GMT
హిందూయిజం కాదు.. హిందూత్వం.. పేరు మార్పు వెనుక పెద్ద కథే
X

ప్రపంచంలో మూడో అతిపెద్ద మతం హిందూ మతం. భారత ఉపఖండవ్యాప్తంగా ఉన్న ఈ మతాన్ని 120 కోట్ల మందిపైగా ఆచరిస్తున్నారు. అమెరికా వంటి ఇతర దేశాల్లోనూ భారతీయ హిందువులు అధికంగా ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్న క్రైస్తవాన్ని 240 కోట్లు, రెండో స్థానంలోని ఇస్లాం 190 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. నాలుగో స్థానంలో బుద్ధిజం ఉంది. 50 కోట్ల మంది ఈ మతాన్ని ఆచరిస్తున్నారు. భారత్ లో అయితే హిందూత్వ అనే సంబోధిస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, మాత్రం హిందూయిజం అనే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూయిజం కాదు.. ఇకపై ‘‘హిందూత్వ’’ అని సంబోధించాలని తీర్మానించారు

కారణం ఇది..

‘‘ఇజమ్’’ అంటే ‘‘ఒక వాదం’’. ఏదైనా ఒక మార్గాన్ని నమ్మితే వచ్చేదే ఈ వాదం. ఉదాహరణకు కమ్యూనిజం, నక్సలిజం, టెర్రరిజం.. ఇలాంటి పదాలే. అయితే, హిందూయిజం మాత్రం పక్కాగా మతానికి సంబధించినది. అద్భుత బోధనలు, చక్కటి జీవన విధానాన్ని ప్రతిబింబించే ఈ మతానికి పాశ్చాత్య దేశాల వారూ ఆకర్షితులవుతున్నారు. కాకపోతే.. 'యిజం' అణచివేత, వివక్షలను ప్రతిబింబించేలా ఉందని, ఆ పదాన్ని త్యజిద్దామని నిర్ణయించారు. మరింత విస్తృతంగా, కచ్చితంగా మత సారాన్ని బోధించే ‘హిందుత్వ’, ‘హిందూ ధర్మ’ అనే పదాలను అనుసరిద్దామని నిర్ణయించారు.

ప్రపంచ హిందూ మహా సభ తీర్మానం

థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో శుక్రవారం ప్రారంభమైన ప్రపంచ 3వ హిందూ మహా సభ (డబ్ల్యూహెచ్‌ సీ)లో ‘‘హిందూయిజం’’ పదంపై ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ తీర్మానం చేసింది. ఇక మీదట హిందూత్వ అనే వాడాలని పేర్కొంది. ‘‘హిందూ ధర్మలోని మొదటి పదం ‘హిందూ’ హద్దులు లేనిది.. సనాతనం, శాశ్వతమైనది. ధర్మం మనల్ని నిలబెట్టేది’’ అని ప్రకటన విడుల చేసింది. కాగా, ఈ సమావేశాలు మూడు రోజులపాటు జరుగుతాయి. 60 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవడం విశేషం.

పూర్వీకులు చెప్పింది హిందూత్వనే..

‘ఇజం’తో కూడిన హిందూయిజం హిందూత్వకు పూర్తిగా భిన్నమైనదని ప్రపంచ హిందూ కాంగ్రెస్ ప్రతినిధులు పేర్కొన్నారు. అందుకే పూర్వీకులు ‘హిందుత్వ’ అనేవారని, దీనితో ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశానికి ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ హాజరయ్యారు. భౌతికవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ ప్రయోగాలతో సతమతం అవుతున్న ప్రపంచానికి భారత దేశం సంతోషానికి, సంతృప్తికి బాట చూపుతుందన్నారు. హిందువులంతా ఏకమై ప్రపంచంతో అనుసంధానం కావాలని కోరారు. మరోవైపు రెండు నెలల కిందట సనాతన ధర్మంపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నేతలు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనే వరకు వెళ్లారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా వివాదం రేగింది. తాజాగా ప్రపంచ హిందూ ‘‘కాంగ్రెస్‌ హిందూత్వ’’ ప్రకటన చేయడం గమనార్హం.