మండలి సాధించారు.. జనసేన నుంచి పోటీ!
ప్రస్తుత ఎన్నికల్లో అవనిగడ్డ టికెట్‌పై మండలి పోటీ చేయనున్నారు.
By: Tupaki Desk | 4 April 2024 12:12 PM GMTరాజకీయాల్లో సీనియర్ నాయకుడిగానే కాకుండా.. వివాద రహితుడిగా కూడా పేరు తెచ్చుకున్న మాజీ మం త్రి.. మండలి బుద్ద ప్రసాద్ ఎట్టకేలకు టికెట్ దక్కించుకున్నారు. అయితే.. అది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ నుంచి కాకుండా.. జనసేన నుంచికావడం గమనార్హం. తాజాగా పవన్ కల్యాణ్.. మండలికి టికెట్ ప్రకటించారు. ప్రస్తుత ఎన్నికల్లో అవనిగడ్డ టికెట్‌పై మండలి పోటీ చేయనున్నారు. అయితే.. ఆయన జనసేన తరఫున నామినేషన్ వేయనున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన మండలి... కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. దాదాపు 50 ఏళ్లకు పైగానే మండలి కుటుంబం తాత తండ్రుల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న మండలి 2014లో అవనిగడ్డ నుంచి విజయం దక్కించుకున్నారు. దీంతో ఉప సభాపతి సీటును కూడా ఆయనకు చంద్రబాబు ఆఫర్ చేశారు. ఇక, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసినా.. వైసీపీ హవాలో మండలి పరాజయం పాలయ్యారు.
ఇక, ప్రస్తుత ఎన్నికల్లో అవనిగడ్డ టికెట్ విషయంలో ఎలాంటివివాదం లేకపోయినా. చంద్రబాబు ఈ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో ఇక్కడ నుంచి వంగవీటి రాధాను పోటీకి పెడుతున్నారనే చర్చ సాగింది. తర్వాత.. మరో ఇద్దరి పేర్లు కూడా వినిపించాయి. ఇదిలావుంటే.. ఈ సీటును జనసేనకు కేటాయించడంపై మండలితీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయని అనుకోలేదంటూ.. కామెంట్లు కుమ్మరించారు.
దీంతో కాపు సామాజిక వర్గంలో కలకలం రేగుతుందని భావించిన.. జనసేన.. ఆయనను తన పార్టీలోకి తీసుకుని.. 24 గంటలు కూడా గడవకముందే టికెట్ ప్రకటించడంగమనార్హం. అవనిగడ్డ నుంచి వైసీపీ తరఫున సింహాద్రి రమేష్ పోటీ చేస్తున్నారు. ఈయన కూడా కాపు నాయకుడే. దీంతో అవనిగడ్డ ఫైట్ హోరా హోరీగా సాగుతుందనే వాదన వినిపిస్తుండడంగమనార్హం.