'నోరారా' బీఆర్ఎస్ ను పైకి లేపే పెద్ద చాన్స్ మిస్ కొట్టిన కేసీఆర్
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా ఈ సమావేశాలకు హాజరవడం ప్రత్యేకత.
By: Tupaki Desk | 4 Aug 2024 4:30 PM GMTప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి వాగ్ధాటి కలిగిన నాయకులు చాలా తక్కువమంది. ప్రజలు మనం చెప్పేది ఆసక్తిగా వినడమే కాదు.. ఆకట్టుకోవాలి. ఈ కోవలో చూస్తే ముందుండేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కీలక నాయకులు హరీశ్ రావు, కేటీఆర్. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా మంచి వక్తే. ఇక రేవంత్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లు బహిరంగ సభల్లోనే కాదు.. అసెంబ్లీలో మాట్లాడినా వినేందుకు ముచ్చటగా ఉంటుంది. చలోక్తులు, పిట్ట కథలు, ఎత్తిపొడుపులు, ఉదాహరణలతో వీరు మాట్లాడే కొద్దీ వినాలని అనిపిస్తుంది. కాగా, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఇందులో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా ఈ సమావేశాలకు హాజరవడం ప్రత్యేకత.
వచ్చింది ఒక్క రోజే..
కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో ప్రిపక్ష నాయకుడు. 20 ఏళ్ల తర్వాత ఆయన ఈ పాత్రలో ఉన్నారు. టీ(బీ)ఆర్ఎస్ స్థాపించిన 2001 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ ఆ పార్టీ ఏకైక సభ్యుడు. 2004 నుంచి 2014 వరకు ఆయన ఎంపీగా ఉండడంతో అసెంబ్లీకి రావాల్సిన అవసరం పడలేదు. 20014 తర్వాత వచ్చినా.. అది నేరుగా సీఎం హోదాలోనే. గత ఏడాది ఓటమితో ప్రతిపక్ష పాత్రలోకి మారారు. అసెంబ్లీలో మాత్రం మొన్నటి బడ్జెట్ సమావేశాల వరకు అడుగుపెట్టలేదు. అయితే, వచ్చింది కూడా ఒక్క రోజే.. సభలో ఇలా కనిపించి అలా బయటకు వచ్చేశారు. అరుదైన సీన్ తరహాలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
చీల్చింది లేదు.. చెండాడింది లేదు
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను రైతు వ్యతిరేకంగా అభివర్ణించిన కేసీఆర్.. ఇక రేవంత్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతాం అని మీడియా పాయింట్ లో గంభీర వ్యాఖ్యలు చేశారు. కానీ, చీల్చింది లేదు చెండాడింది లేదు. అసలు ఆ తర్వాత శాసన సభకే రాలేదు. బడ్జెట్ సెషన్ అంతటినీ బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, హరీశ్ రావులే నడిపించారు. ఇక్కడ కేసీఆర్ చాలా పెద్ద చాన్స్ మిస్ కొట్టారు. ఆయన అసెంబ్లీకి సగం రోజులైనా హాజరై.. కేటీఆర్, హరీశ్ లను చెరోవైపున పెట్టుకుని బడ్జెట్ పై, రైతు రుణ మాఫీ వంటి కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు తీరును చీల్చి చెండాడితే అదిరిపోయేది. కాని, దీనిని ఆయన పట్టించుకున్నది లేదు.
నోరారా.. పోగొట్టారా?
తలపండిన రాజకీయ నాయకుడైన కేసీఆర్ కు వేరొకరు సలహా ఇవ్వాల్సిన పనిలేదు. అయితే, బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితి చాలా భిన్నం. బహుశా ఉద్యమ కాలంలోనూ ఇలాంటి ఇబ్బంది లేదేమో? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడిపోతున్నారు.. కింది స్థాయి కేడర్ లో భరోసా నింపే ప్రయత్నం చేయాలి. అందుకు అసెంబ్లీ సరైన వేదిక. శాసన సభకు హాజరై తనదైన శైలిలో కేసీఆర్ నిప్పులు చెరిగి ఉంటే అటు ప్రజల్లో, ఇటు కేడర్ లో చర్చ జరిగేది. కానీ, అసెంబ్లీని హరీశ్, కేటీఆర్ కు వదిలేసి కేసీఆర్ తన మానాన తాను మౌనంగా ఉండిపోయారు.