Begin typing your search above and press return to search.

ఏపీలో అతిగా భ‌య‌ప‌డుతున్నారు: కేంద్ర ఎన్నిక‌ల సంఘం

ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 6:34 PM GMT
ఏపీలో అతిగా భ‌య‌ప‌డుతున్నారు:  కేంద్ర ఎన్నిక‌ల సంఘం
X

దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రానికి స‌ర్వం సిద్ధ‌మైంది. ఇక‌, రేపో మాపో .. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌ట‌నే త‌రువాయి అన్న ట్టుగా ఉంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు స‌ర్వ స‌న్న‌ద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. పార్లమెంటరీ ఎన్నికలతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు.

ఏపీలో స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాలు చాలా వ‌రకు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని తెలిపారు. అయితే, న‌కిలీ ఓట్లు, దొంగ ఓట్ల‌పై త‌మ‌కు పుంఖాను పుంఖాలుగా ఫిర్యాదులు అందాయని.. ప్రధాన ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి వ్య‌క్తిగ‌తంగా కూడా.. చాలా మంది త‌మ‌కు ఫిర్యాదు చేశార‌ని తెలిపారు. అయితే.. ప్ర‌తి ఫిర్యాదును క్షుణ్ణంగా ప‌రిశీలించామ‌ని.. వీటిలో పేర్కొన్న వివ‌రాల మేర‌కు క్షేత్ర‌స్థాయిలో సిబ్బంది ప‌రిశీల‌న చేశార‌ని రాజీవ్ కుమార్ వివ‌రించారు. కొన్ని త‌ప్పులు దొర్లిన మాట వాస్త‌వ‌మేన‌ని , వాటిని స‌రిదిద్ది తుది ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేశామ‌ని అన్నారు.

ఏపీలో ప్ర‌తిప‌క్షాల భ‌యాందోళ‌న‌ల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్టు రాజీవ్ కుమార్ తెలిపారు. అయితే.. అతిగా భ‌య‌ప డ‌డం స‌రికాద‌ని సూచించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు బాగానే ఉన్నాయ‌ని కేంద్ర హోం శాఖ పేర్కొన‌ట్టు తెలిపారు. అయిన‌ప్ప టికీ.. ఎన్నిక‌ల విధుల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉంటామ‌ని తెలిపారు. ఇక‌, ఒడిశా ఎన్నికల గురించి మాట్లాడుతూ.. దాదాపు 50% మేర పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు. దివ్యాంగులు, మహిళల్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.

"ఒడిశాలోని 50% మేర పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పిస్తాం. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 37809 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తాం. అందులో 22,685 బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఉంటుంది. దివ్యాంగులు, మహిళలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 300 పోలింగ్‌ బూత్‌లను దివ్యాంగులే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం`` అని రాజీవ్ కుమార్ వివ‌రించారు.