Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా? త్వరలో భార్యను సీఎం చేస్తున్నారా?

తాజాగా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితులు ఉండనున్నాయని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 4:17 AM GMT
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా? త్వరలో భార్యను సీఎం చేస్తున్నారా?
X

మోడీ పదేళ్ల పాలనలో ఈడీ.. సీబీఐ.. ఐటీ విభాగాల వేట ఎంతలా ఉంటుందన్న విషయంపై బోలెడన్ని ఉదాహరణలు దేశ ప్రజలకు అలవాటుగా మారాయి. కారణం ఏమైనా కానీ.. రాజకీయ వైరం వ్యక్తిగత అంశంగా మారిపోయి.. అంతు చూసే వరకు వదలకూడదన్నట్లుగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ తీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారిని సైతం వదలని పరిస్థితి. తాజాగా మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితులు ఉండనున్నాయని చెబుతున్నారు.

తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేయనున్నారని.. ఆయన సతీమణి కల్పన సోరెన్ ను సీఎం చేయనున్నట్లుగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

అక్రమ మైనింగ్ ఇష్యూలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఇప్పటికే పలుమార్లు మనీలాండరింగ్ కేసులు నమోదు కావటం.. విచారణకు రావాలని చెబుతున్నా.. ఆయన స్పందిస్తున్నది లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు అందాయి. డిసెంబరు 30న లెటర్ కం సమన్లను ఈడీ పంపింది. మనీలాండరింగ్ కేసులో తాము ప్రశ్నించేందుకు వీలుగా సమయం చెప్పాలని ముఖ్యమంత్రిని ఈడీ కోరింది. ఏడోసారి ఆయనకు సమన్లను పంపింది. ఆగస్టు 14న తొలి నోటీసును ఈడీ జారీ చేస్తే.. ఈ మూడున్నర నెలల కాలంలో ఏడుసార్లు సమన్లు పంపిన పరిస్థితి.

తొలి నోటీసు అందుకున్నంతనే ఈడీ చర్యల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సీఎం హేమంత సుప్రీంకోర్టు.. జార్ఖండ్ హైకోర్టులను ఆశ్రయించారు. అయితే.. ఆయన పిటిషన్లను రెండు అత్యున్నత న్యాయస్థానాలు కొట్టేశాయి. ఇదిలా ఉంటే.. తప్పుడు అభియోగాలు.. ఉద్దేశాలతో తనకు సమన్లు పంపారన్నది ఆయన ఆరోపణ. జార్ఖండ్ లో రాజకీయ అనిశ్చితిని క్రియేట్ చేసేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆయన మండిపడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ.. గతంలో రాంచీ డిప్యూటీ కమిషనర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి ఛావి రంజన్ తో సహా పద్నాలుగు మందిని ఈడీ అరెస్టు చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యే సర్ఫరాజ్అహ్మద్ తన పదవికి రాజీనామా చేస్తూ.. లేఖను ముఖ్యమంత్రికి పంపగా ఆయన ఆమోదించినట్లుగా చెబుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ ఎంపీ ఒకరు తాజా అప్డేట్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేసి.. తన సతీమణిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతారని.. త్వరలో ఆ దిశగా పరిణామాలు చోటు చేసుకుంటాయన్న మాట ఇప్పుడు సంచనలంగా మారాయి. గడిచిన ఆరుసార్లు ఈడీ నోటీసులకు స్పందించని జార్ఖండ్ సీఎం.. ఈసారి అందుకు భిన్నంగా రియాక్టు కాక తప్పని పరిస్థతులు నెలకొన్నట్లుగా చెబుతున్నారు.