అక్కడ కిలో చేపలు రూ.10 !
ఒకప్పుడు హైదరాబాద్ లో ఎవరైనా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో పని ఉందంటే దీనిని పట్టుకుని వెళ్లేవారట.
By: Tupaki Desk | 27 May 2024 7:30 AM GMTచేపల కూర. దీని రుచిచూడని భోజనప్రియులు దాదాపు ఉండకపోవచ్చు. శాఖాహారులు కూడా వీటిని జలపుష్పాలు అంటూ సంతోషంగా భుజిస్తారు. ఇక నెల్లూరు చేపల పులుసుకు ఉన్న రుచికి, గోదావరి జిల్లాలలో దొరికే పులస చేపలకు ఉన్న డిమాండ్ మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు హైదరాబాద్ లో ఎవరైనా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో పని ఉందంటే దీనిని పట్టుకుని వెళ్లేవారట. ఇక వీటితో పాటు నిత్యం దొరికే బొచ్చె, రవ్వ, శీలావతి, పండుగప్ప, కొరమీను లాంటి రకాలు ఉంటాయి.
అయితే ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలలో ఉన్నట్లుండి చేపల ధరలు అమాంతం పడిపోయాయి. నిన్నటి వరకు రూ.150 కిలో పలికిన చేపలు ప్రస్తుతం కిలో రూ.10, రూ.20కి పడిపోయాయి. దీంతో చేపలు కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చిన మార్పుల మూలంగా చేపల చెరువులలో ఆక్సిజన్ పడిపోయి చేపలు మరణిస్తున్నాయి. దీంతో రైతులు భారీ ఎత్తున చేపలను మార్కెట్ కు తరలిస్తున్నారు. దీంతో ధరలు దారుణంగా పడిపోయాయి.
చేపలలో బొచ్చె , శీలావతి, పండుగప్ప, గడ్డి చేప లాంటి రకాలకు నిత్యం డిమాండ్ ఉంటుంది. అన్నింటికి కిలోకి రూ.150కి తక్కువ కాకుండా ధర లభించేది. ఒక్కొక్క చేప కిలో నుండి ఐదు కిలోల బరువు తూగుతున్నాయి. ప్రస్తుతం చేపలు కొనేవారు లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపలను మార్కెట్ కు తీసుకువస్తే కనీసం కిరాయి ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. నిన్నటిదాకా రాజుల్లా ఉన్న రైతులు తాజా పరిణామాలతో నీరుగారిపోయారు.