దేశంలో సంపన్నులు స్పీడ్ గా పెరుగుతున్నారట
ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించిన ఒక నివేదిక గణాంకాల రూపంలో వెల్లడించింది.
By: Tupaki Desk | 14 Jan 2024 4:56 AM GMTగతానికి భిన్నంగా గడిచిన పదేళ్లలో దేశ ఆర్థిక పరిస్థితుల్లో మాత్రమే కాదు.. దేశ ప్రజల సంపదలోనూ బారీ ఎదుగుదల కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించిన ఒక నివేదిక గణాంకాల రూపంలో వెల్లడించింది. దేశంలో సంపన్నుల సంఖ్య స్పీడ్ గా పెరుగుతున్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ నయా సంపన్నులు ఖరీదైన వస్తువుల్ని కొనేందుకు.. విలాసవంతమైన వస్తుత్పుతల సేవల్ని సొంతం చేసుకోవటానికి ఆసక్తిని చూపుతారని పేర్కొంది. అంతేకాదు.. రానున్న రోజుల్లో దేశంలో పెరిగే సంపన్నుల సంఖ్య గురించి ఆసక్తికర అంశాల్ని తన నివేదికలో వెల్లడించింది.
గోల్డ్ మన్ శాక్స్ తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ‘ది రైజ్ ఆఫ్ అఫ్లుయెంట్ ఇండియా’ పేరుతో ఉండే ఈ రిపోర్టులో దేశంలో ధనికుల జాబితాను పేర్కొనటమే కాదు.. రాబోయే రోజుల్లో ఇదెంత పెరుగుతుందన్న విషయాన్ని అంచనా కట్టింది. ప్రస్తుతం దేశంలో ధనిక జనాభా సంఖ్య 6 కోట్లు ఉందని.. రానున్నరోజుల్లో ఇది మరింత పెరుగుతుందని పేర్కొంది. నాలుగేళ్ల వ్యవధిలో అంటే.. 2027 నాటికి దేశంలో ధనికుల సంఖ్య ఏకంగా 10 కోట్ల మంది అవుతారని వెల్లడించింది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఒక దేశంలో 10 కోట్ల మంది ప్రజలు ధనికులుగా ఉన్న దేశాలు ప్రపంచంలో 14 మాత్రమే ఉన్నాయని.. వాటిల్లో భారతదేశం ఒకటి అవుతుందని స్పష్టం చేసింది. ఈ రిపోర్టులో పేర్కొన్న ధనికులు అన్న మాటకు లెక్క ఏం వేశారన్న ప్రశ్న తలెతొచ్చు. వార్షిక ఆదాయం మన రూపాయిల్లో 8.3 లక్షలుగా పేర్కొన్నారు. డాలర్ల లెక్కలో అయితే 10వేల డాలర్ల మొత్తాన్ని ఏడాదిలో సంపాదించే వారంతా ధనికులుగా పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుతం పని చేస్తున్న వారిలో ధనికులు నాలుగు శాతంగా అంచనా వేశారు. ధనికులు పెరిగే కొద్దీ.. వారంతా ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసే వాటిపై ఆసక్తి చూపిస్తారని నివేదిక వెల్లడించింది. అంతేకాదు.. దీని ప్రభావం స్టాక్ మార్కెట్ మీద ఉంటుందని.. పాజిటివ్ పరిణామాలకు అవకాశం ఉంటుందని అంచనా వేసింది.