2023లో ప్రపంచంలోనే సంపన్న కుటుంబం గురించి తెలుసా?
ఈ సందర్భంగా వెలుగులోకి వస్తున్న ఈ రాజ కుటుంబ ఆస్తుల వివరాలు, వారి సంపద విలువ వైరల్ గా మారింది.
By: Tupaki Desk | 23 Jan 2024 10:53 PM ISTవాల్టన్ కుటుంబాన్ని దాటి.. 2023లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా అవతరించింది ఓ రాజ కుటుంబం. ఈ సమయంలో వారికి సంబంధించిన కార్లు, ప్రైవేటు విమానాలు, భవంతులు, నౌకలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్తులు మొదలైన వివరాలపై గూగుల్ లో సెర్చ్ మొదలైంది. ఈ సందర్భంగా వెలుగులోకి వస్తున్న ఈ రాజ కుటుంబ ఆస్తుల వివరాలు, వారి సంపద విలువ వైరల్ గా మారింది.
అవును... గత ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా ఒక రాజ కుటుంబం అవతరించింది. అదే... యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్ రాజ కుటుంబం. యూఏఈని పాలిస్తోన్న ఈయన ఈ కుటుంబ పెద్ద కాగా.. ఈ కుటుంబంలో 18 మంది సోదరులు, 11 మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఇక ఈయన విషయానికొస్తే... తొమ్మిది మంది సంతానం.. 18 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు.
ఇక షేక్ మహ్మద్ బిన్ జయీద్ ఆస్తుల విషయానికొస్తే అదొక పెద్ద లిస్ట్ ఉంటుంది. కాలిక్యులేటర్లు మూగబోయే అంకెలు ఇక్కడ దర్శనమిస్తుంటాయి!! సామాన్యుడి ఊహకు ఏమాత్రం అందని రీతిలో వీరి విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఇందులో భాగంగా... వీరి ప్యాలెస్ విలువ సుమారు 4 వేల కోట్ల రూపాయలు పైమాటే! ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే!
వీరి ప్రధాన ఆదాయ వనరు చమురు వ్యాపారం. కారణం... ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో సుమారు ఆరు శాతం ఈ కుటుంబం అధీనంలోనే ఉన్నాయి. ఇదే సమయంలో రూ.2,122 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మాంచెస్టర్ సిటీ ఫుట్ బాల్ క్లబ్ వీరి యాజమాన్యంలోనే ఉంది. ఇదే సమయంలో ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తోపాటు పలు ప్రముఖ కంపెనీల్లోనూ వీరికి వాటాలున్నాయి.
ఇక సుమారు 700కు పైగా కార్ల కలెక్షన్ ఉండగా.. వాటిలో విలాసవంతమైన బుగాటి, లంబోర్గిని, మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ లు ఉన్నాయి. వీటితో పాటు ప్రధానంగా ప్రత్యేక విమానాలు, వేల కోట్ల విలువ చేసే నౌకలు వీరి సొంతం.
ఈ స్థాయిలో ఆదాయం, ఆస్తులు ఉన్న ఈ కుటుంబం నివసించే భవంతి ఏ స్థాయిలో ఉంటుందనేది ఎవరి ఊహకు వారికి వదిలేయవచ్చు. యూఏఈలో వారికున్న ఎన్నో భవనాల్లో అతి పెద్దదైన అబుదాబీలోని ఖాసర్ అల్ వాటన్ అధ్యక్ష భవనంలో రాజకుటుంబ సభ్యులు ఉంటున్నారు. పెంటగాన్ వైశాల్యానికి ఇది మూడు రెట్లు ఎక్కువ. సుమారు 94 ఎకరాల్లో విస్తరించి ఉన్న దీని విలువ రూ. 4,078 కోట్లు.