పవన్ ఎఫెక్ట్... తూగోలో కీలక నేతల త్యాగాలు మస్ట్!
ఇందులో భాగంగా నిన్నటివరకూ కాకినాడ పర్యటనలో ఉన్న పవన్... వచ్చే ఏడాది జనవరి 3 తర్వాత కూడా మరో మూడు రోజులు కాకినాడలో పర్యటించనున్నారని తెలుస్తుంది.
By: Tupaki Desk | 31 Dec 2023 1:30 PM GMTఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఆ విషయంలో గోదావరి జిల్లాల ఓట్లు, సీట్లు అత్యంత కీలకం అనేది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా గోదావరి జిల్లాల్లో తన సత్తా చాటలని, ఈ జిల్లాల్లో అత్యధిక స్థానాలు సంపాదించాలని జనసేన అధినేత పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా నిన్నటివరకూ కాకినాడ పర్యటనలో ఉన్న పవన్... వచ్చే ఏడాది జనవరి 3 తర్వాత కూడా మరో మూడు రోజులు కాకినాడలో పర్యటించనున్నారని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై పవన్ కల్యాణ్ ఎక్కువ దృష్టి సారించారని.. వీలైతే ఈదఫా తానుకూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే పోటీచేయాలనే ఆలోచన చేస్తున్నారని.. అందుకు తగిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా కాకినాడ సిటీలో పోటీచేస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే విషయంపై లోతుగా అధ్యయనం చేస్తున్నారని అంటున్నారు.
వాస్తవానికి పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వారాహి యాత్రలో భాగంగా కాకినాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని గెలవనీయనని శపథం చేసారు. ఆ సమయలో పవన్ వర్సెస్ ద్వారంపూడి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో ధమ్ముంటే తనపై పోటీ చేయాలని ద్వారంపూడి.. పవన్ కి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పవన్ ఆ దిశగా ఆలోచిస్తున్నారని అంటున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్.. కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఆ సీటు కాకుండా మరో ఏడు సీట్లపై పవన్ దృష్టిసారించారని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, పిఠాపురం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాలను పొత్తులో భాగంగా దక్కించుకుని.. అక్కడ నుంచి జనసేన తరుపున బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
అదే జరిగితే టీడీపీలో ఈ ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి పలువురు సీనియర్లు త్యాగాలు చేయక తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతమందికి సర్ధుబాటు చేయడం ఆల్ మోస్ట్ అసాధ్యం కాబట్టి.. ఒకరిని సర్ధుబాటు చేసి, మరొకరిని సైడ్ చేస్తే అంతర్గత కుమ్ములాటలు పెరిగి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని బాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు. దీంతో... పలువురు సీనియర్లు తమ తమ స్థానల త్యాగాలకు ఫిక్సవ్వాలనే సూచలను సూచన ప్రాయంగా చేరాయని తెలుస్తుంది.
వీరిలో ప్రధానంగా... 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి.. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయిస్తారని.. ఇక్కడ నుంచి ఆ పార్టీ తరుపున కందుల దుర్గేష్ పోటీచేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో పిఠాపురం నుంచి టీడీపీ సీనియర్ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ సైతం త్యాగం చేయక తప్పదని తెలుస్తుంది.
ఇక వీరితో పాటు అమలాపురం నియోజకవర్గం నుంచి అయినాబత్తుల ఆనంద రావు, కొత్తపేట నుంచి బండారు సత్యానంద రావు, కాకినాడ రూరల్ నుంచి పిల్లి అనంత లక్ష్మీ, కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి వనమాడి వెంకటేశ్వర్ రావు, రాజోలు నియోజకవర్గం నుంచి గొల్లపల్లి సూర్యారావు, ముమ్మిడివరం నుంచి దాట్ల సుబ్బరాజు త్యాగాలు తప్పవని అంటున్నారు.
అయితే వీరిలో మాజీమంత్రి, సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావుకు మాత్రం రాజోలు జనసేనకు ఇస్తుండటంతో... పక్కనే ఉన్న పి.గన్నవరం నియోజకవర్గాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మిగిలిన ఏడుగురు నేతలూ త్యాగాలు తప్పవని అంటున్నారు!!