పొత్తు కుదిరినట్టే.. బీజేపీ పోటీ చేసే సీట్లు ఇవే!
అయితే ఎట్టకేలకు బీజేపీ కూడా టీడీపీ, జనసేనలతో కలిసి పోటీ చేయడానికి దాదాపు అంగీకరించినట్టేనని తెలుస్తోంది.
By: Tupaki Desk | 1 March 2024 5:07 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టీలతో కలిసి బీజేపీ కూడా కలసి పోటీ చేస్తుందని, పోటీ చేయదని రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఎట్టకేలకు బీజేపీ కూడా టీడీపీ, జనసేనలతో కలిసి పోటీ చేయడానికి దాదాపు అంగీకరించినట్టేనని తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. టీడీపీ అధినేత చంద్రబాబు మార్చి 4న న్యూఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. మార్చి 5న ఎన్డీయేలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.
మార్చి 12 లేదా 13న ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ–జనసేన కూటమిలో చేరడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఎట్టకేలకు 12 అసెంబ్లీ సీట్లు, 7 లోక్ సభ స్థానాలను బీజేపీకి కేటాయించేందుకు టీడీపీ అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు, 18 అసెంబ్లీ సీట్లు కావాలని పట్టుబట్టిందని తెలుస్తోంది. కానీ టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాన్ని చూసిన తర్వాత తన వంతు సీట్లను కూడా తగ్గించుకుందని తెలుస్తోంది.
ఈ మేరకు బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమిలో చేరుతున్నట్టు ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. పొత్తు కుదిరిన తర్వాత మార్చి 5న టీడీపీ అధికారికంగా ఎన్డీయేలో చేరుతుంది అని న్యూఢిల్లీ వర్గాలు తెలిపాయి.
కాగా ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసిన సీట్లలో కొన్నింటిని బీజేపీ అడిగే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కాబట్టి ఇప్పటికే ప్రకటించిన జాబితాల్లో చంద్రబాబు, పవన్ చిన్న చిన్న మార్పులు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాటా ఇవ్వాలని బీజేపీ కూడా కోరుతుందని తెలుస్తోంది. 2014లో బీజేపీ ఇలాగే చంద్రబాబు ప్రభుత్వంలో చేరింది.
కాగా విశాఖపట్నం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, తిరుపతి, రాజంపేట, హిందూపురం లోక్ సభ స్థానాలను బీజేపీకి కేటాయించేందుకు చంద్రబాబు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
అలాగే విశాఖపట్నం (ఉత్తరం), తాడేపల్లిగూడెం, కైకలూరు, గుంటూరు (పశ్చిమ), జమ్మలమడుగు, ధర్మవరం, రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానాలతో పాటు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కో సీటు బీజేపీకి దక్కే అవకాశం ఉంది.