కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. కీలక నేతలకు ఛాన్స్
ఇక, రెండు స్థానాలకు ఇద్దరు కీలక నాయకులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.
By: Tupaki Desk | 16 Jan 2024 8:44 PM GMTతెలంగాణలో ఈ నెల 29న జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. వాస్తవానికి ఈ రెండు స్థానాలకు కూడా.. ఎన్నికల సంఘం వేర్వేరుగానే నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒకటే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థన మేరకు.. ఇలా వేర్వేరు ప్రకటనలు ఇచ్చింది. ఇక, రెండు స్థానాలకు ఇద్దరు కీలక నాయకులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.
అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ పేర్లను అధిష్టానం ఎంపిక చేసింది. వీరిద్దరికీ వారి అభ్యర్థిత్వాల విషయాన్ని పార్టీ వెల్లడించింది. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని పార్టీ సూచించింది. కాగా, ఈ నెల 18తో నామినేషన్ల గడువు ముగియనుండగా.. 29వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్లను లెక్కించి.. ఫలితం వెల్లడించనున్నారు. అసెంబ్లీలోని 119 మంది ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటారు.
సంఖ్యా బలం పరంగా చూస్తే.. కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పైగా ఏ ఎమ్మెల్సీకి ఆ ఎమ్మెల్సీ పరంగా ఎన్నికల పోలింగ్ జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీనే ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోనుంది. మరోవైపు.. ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన తీన్మార్ మల్లను ఈ దఫా నిరాశే ఎదురైంది. మరో రెండు మాసాల్లో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో వాటిలో తీన్మార్ మల్లన్నకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.