ఆ దేశ సరిహద్దుల్లో రష్యా అధ్యక్షుడి రహస్య భవనం.. దీని ప్రత్యేకతలు ఇవే!
అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ విధ్వంసమే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నారు.
By: Tupaki Desk | 30 Jan 2024 3:30 PM GMTరష్యాకు అధ్యక్షుడిగా, ఆ తర్వాత ప్రధానిగా, మళ్లీ అధ్యక్షుడిగా ఇలా దాదాపు గత 25 ఏళ్ల నుంచి వ్లాదిమిర్ పుతిన్ ప్రస్థానం కొనసాగుతోంది. దాదాపు గత రెండేళ్లుగా ఉక్రెయిన్ పై యుద్ధ భేరి మోగించిన రష్యా అధినేత పుతిన్ ఇప్పటికీ దానికి పుల్ స్టాప్ పెట్టలేదు. అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ విధ్వంసమే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రష్యా అధినేతను మట్టుబెట్టడానికి ఉక్రెయిన్ తోపాటు యూరోప్ దేశాలు కొన్ని, అమెరికా ప్రయత్నాలు చేస్తున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్లాదిమిర్ పుతిన్ కు రష్యా రాజధాని మాస్కో నగరంలో కాకుండా ఒక రహస్య భవనం ఉందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ రహస్య భవనం ఫిన్లాండ్ దేశానికి 30 కిలోమీటర్ల దూరంలో రష్యా సరిహద్దుల్లోని రిపబ్లిక్ ఆఫ్ కరెలీనాలో ఉందని చెబుతున్నారు.
ఇన్వెస్టిగేటివ్ సంస్థ.. ‘ది డోసియర్ సెంటర్’ తెలుసుకున్న వివరాల ఆధారంగా ‘మాస్కో టైమ్స్’ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. ర ష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫిన్లాండ్ కు 30 కిలోమీటర్ల దూరంలోని రష్యా సరిహద్దుల్లో రహస్య భవనం ఉందని వెల్లడించింది.
రిపబ్లిక్ ఆఫ్ కరెలీనాలో ఉన్న మర్జలహటి బే వద్ద ఉన్న ఈ భవన సముదాయంలో మూడు అత్యాధునిక భవనాలు ఉన్నాయని మాస్కో టైమ్స్ తన కథనంలో పేర్కొంది. భవనం ప్రాంగణంలో రెండు హెలిపాడ్లు కూడా ఉన్నాయని వెల్లడించింది. అంతేకాకుండా ఇక్కడ అత్యంత విలాసవంతమైన బోట్లను నిలిపేలా ఏర్పాట్లు కూడా ఉన్నాయంది. ఇంకా ప్రత్యేకంగా నాణ్యమైన గొడ్డు మాంసం కోసం అవసరమైన వ్యవస్థ కూడా ఉందని తెలిపింది. మొత్తం ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఇది ఉన్నట్లు డ్రోన్ ద్వారా చిత్రీకరించిన దృశ్యాల ఆధారంగా తెలుస్తోందని పేర్కొంది.
కాగా ఈ రహస్య భవనం సమీపంలోనే ఒక జలపాతం కూడా ఉందని మాస్కో టైమ్ తన కథనంలో వెల్లడించింది. దీన్ని లడోగా స్కెర్రీస్ నేషనల్ పార్క్ నుంచి పుతిన్ అక్రమంగా దక్కించుకున్నారని డోసియర్ సెంటర్ ఆరోపిస్తున్నట్టు పేర్కొంది.
ఈ రహస్య భవనంలో 24 గంటలపాటు గస్తీ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయని తెలిపింది. వీటిని తప్పించుకుని డ్రోన్ తో ఆ రహస్య భవనాన్ని ఎలా చిత్రీకరించారనేది మాత్రం డోసియర్ సెంటర్ చెప్పలేదు. కాగా ఈ రహస్య భవన నిర్మాణం పుతిన్ ఆదేశాల మేరకు దాదాపు 10 ఏళ్ల క్రితమే మొదలుపెట్టినట్టు సమాచారం.
రష్యా అధ్యక్షుడి విశ్రాంతి, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను చూసుకొనే ప్రముఖ వ్యాపారవేత్త యూరీ కోవల్చుక్ నెట్‌వర్క్ లో ఈ రహస్య భవనం భాగమని అంటున్నారు. దీనికి సమీపంలో ఉన్న హోటల్ కూడా కోవల్చుక్ దేనని చెబుతున్నారు. కాగా ఈ రహస్య భవనానికి పుతిన్ ఏటా ఒకసారి వస్తుంటారని స్థానికులు వెల్లడించినట్టు మాస్కో టైమ్స్ తన కథనంలో వెల్లడించింది.