Begin typing your search above and press return to search.

డాలర్‌ కు ఇక నూకలు చెల్లుతాయా?

ప్రపంచంలో వివిధ దేశాల వ్యాపార, వాణిజ్యాలు, చెల్లింపులు అమెరికన్‌ డాలర్లలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Sep 2023 6:10 AM GMT
డాలర్‌ కు ఇక నూకలు చెల్లుతాయా?
X

ప్రపంచంలో వివిధ దేశాల వ్యాపార, వాణిజ్యాలు, చెల్లింపులు అమెరికన్‌ డాలర్లలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ కరెన్సీగా డాలర్‌ ను అందరూ అంగీకరించడం వల్ల ఇలా జరుగుతోంది. అయితే ఇప్పుడు అమెరికా ప్రాభవం క్రమంగా క్షీణిస్తోంది. అమెరికా చెప్పినంత మాత్రాన.. అది చెప్పినట్టు తలాడించే దేశాలు కూడా ఇప్పుడు దాదాపు లేవు.

ఈ నేపథ్యంలో అమెరికా డాలర్‌ కు కూడా నూకలు చెల్లినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డాలర్‌ కు దీటుగా చైనా కరెన్సీ యువాన్, భారత కరెన్సీ రూపాయి, రష్యా కరెన్సీ రూబుల్‌ దూసుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో వివిధ దేశాల్లో తన వస్తువులను కుప్పులు తెప్పలుగా పోస్తున్న చైనా ఆ దేశాలతో వాణిజ్యాన్ని డాలర్లలో కాకుండా యువాన్లలోనే చేస్తోంది. అంటే ఆ వస్తువులు కొన్న దేశాలు చైనా కరెన్సీ అయిన యువాన్లలో నగదు చెల్లించాలి.

అలాగే భారత్‌ కూడా ఎక్కువ దేశాలతో కాకపోయినా రష్యా, ఇరాన్, ఒమన్‌ తదితర దేశాలతో రూపాయల్లో చెల్లింపులు జరుపుతోంది. ఆయా దేశాల నుంచి భారత్‌ కొంటున్న చమురుకు డాలర్లలో కాకుండా రూపాయిల్లోనే చెల్లింపులు చేస్తోంది. మరికొన్ని దేశాలతో సైతం ఇదే రకమైన ఒప్పందాలను కుదుర్చుకునే పనిలో ఉంది. ఫలితంగా భారత్‌ కు భారీ ఎత్తున కరెన్సీ ఆదా అవుతోంది. ప్రస్తుతం ఒక్క అమెరికన్‌ డాలర్‌ దాదాపు రూ.85 సమానంగా ఉన్న సంగతి తెలిసిందే. డాలర్లలో చెల్లించడం వల్ల అందుకు సమానమైన భారత కరెన్సీని చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు భారత కరెన్సీలోనే చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఇటు మనదేశానికి, అటు మనతో వాణిజ్యం చేసే దేశాలకు ప్రయోజనం కలుగుతోంది. తాజాగా యూఏఈ నుంచి 10 లక్షల పీపాల చమురుకు రూపాయల్లో చెల్లింపులు జరిపేందుకు భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇక రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధంతో చాలా దేశాలు రష్యాపైన ఆంక్షలు విధించాయి. అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ లోని పలు దేశాలు ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా కూడా ఆ దేశాలకు చమురు ఎగుమతులను నిలిపివేసింది. అతి తక్కువకే చైనాకు, భారత్‌ కు చమురు ఎగుమతులను చేస్తోంది. ఫలితంగా రూబుళ్లలో నగదు స్వీకరిస్తోంది. అమెరికా డాలర్‌ తో పోల్చితే రూబుల్‌ తక్కువే ఉండటం వల్ల భార™Œ , చైనా భారీగా నగదును పొదుపు చేసుకోగలిగాయి. చాలా తక్కువ రేట్లకే రష్యా నుంచి ఈ రెండు దేశాలు చమురు కొనుగోలు చేశాయి. ఈ విషయంలో అమెరికా ఒత్తిడికి కూడా భారత్‌ తలొగ్గలేదు. తమ దేశ ప్రయోజనాలు ముఖ్యమని స్పష్టం చేసింది.

తమ మధ్య వర్తక, వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి భారత్, రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు బ్రిక్స్‌ కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ కూటమిలో సభ్యత్వాన్ని చాలా దేశాలు ఆశిస్తున్నాయి. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ సమావేశాల్లో ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశాలు సభ్యులుగా చేరాయి. డాలరుకు బదులుగా ప్రత్యామ్నాయ కరెన్సీల్లో తమ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్యాలను ప్రోత్సహించాలని బ్రిక్స్‌ దేశాలు నిర్ణయించాయి.

ఈ నిర్ణయంతో మొదట లాభం చైనాకే కలుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దాని కరెన్సీ అయిన యువాన్‌ బలపడుతుందని అంటున్నారు. ఇప్పటికే తనపై అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా పూర్తిగా చాలా అవసరాలకు చైనా పైనే ఆధారపడింది. చైనా కరెన్సీలోనే చెల్లింపులు జరిపి తనకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది.

బ్రిక్స్‌ లో 12 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. చైనా తర్వాత దాదాపు నాలుగు లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత్, పశ్చిమాసియా (సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ), చైనా, రష్యా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల మధ్య స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం భారీగా పెరిగితే అమెరికా కరెన్సీ అయిన డాలర్‌ పెత్తనం ఈ దేశాల్లో తగ్గిపోతుంది.

చైనా ఇప్పటివరకు 41 దేశాల కేంద్ర బ్యాంకులతో ద్వైపాక్షిక కరెన్సీ వినియోగ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఇతర దేశాలతో వాణిజ్య చెల్లింపులకు యువాన్‌ వాడకం 2014లో సున్నా కాగా, 2021 నాటికి అది 20 శాతానికి పెరిగిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వెల్లడించడం చైనా ప్రాబల్యం పెరుగుతుందనడానికి నిదర్శనం.

కాగా అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా వాటా 15 శాతం ఉండగా భారత్‌ వాటా కేవలం 1.8 శాతమే. భారత్‌ కూడా భారీ ఎత్తున ఇతర దేశాలకు చైనా స్థాయిలో ఎగుమతి చేయగలిగితేనే రూపాయికి అంతర్జాతీయ కరెన్సీగా విలువ లభిస్తుందని అంటున్నారు. లేదంటే ఏదో అతి తక్కువ దేశాలకే పరిమితం కావాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

ఇందుకు నిదర్శనం.. రష్యా మొదట్లో చమురును భారతీయ రూపాయల్లో విక్రయించినా, తన వద్ద పేరుకుపోయిన రూపాయి నిల్వలను ఏం చేసుకోవాలో తెలియని స్థితిలో చిక్కుకుంది. అందుకే యూఏఈ దిర్హమ్, చైనీస్‌ యువాన్లలోనూ చెల్లింపులు జరపాలని మనదేశాన్ని కోరింది.

అంతర్జాతీయ వాణిజ్యం పరంగా అమెరికా తరవాతి స్థానం చైనాదే కావడం యువాన్‌ బలపడటానికి దోహదపడుతోందనే విశ్లేషణలు ఉన్నాయి. 2022లో అంతర్జాతీయ వాణిజ్యంలో 21 శాతం, బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యంలో 50 శాతం వాటా చైనాదే. అయితే చైనా కుటిల బుద్ది ఇప్పుడిప్పుడే దాని దగ్గర రుణాలు తీసుకున్న దేశాలకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో చైనా కరెన్సీని అంతర్జాతీయ కరెన్సీగా అంగీకరించడానికి ఆయా దేశాలు ఒప్పుకుంటాయా అన్నది వేయి మిలియన్‌ ‘డాలర్ల’ ప్రశ్న.