Begin typing your search above and press return to search.

14 రోజుల్లోనే ఈ నలుగురు ఎంపీలూ సభ్యత్వం వదులుకోవాల్సిందే..

దీంతో మొత్తం నలుగురు లోక్ సభ ఎంపీలు.. తెలంగాణ మూడో శాసన సభలో అడుగుపెడుతున్నట్లయింది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 3:15 AM GMT
14 రోజుల్లోనే ఈ నలుగురు ఎంపీలూ సభ్యత్వం వదులుకోవాల్సిందే..
X

తెలంగాణలో తాజాగా వెలువడిన ఫలితాల్లో నలుగురు లోక్ సభ సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి (బీఆర్ఎస్) విజయం సాధించగా, మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ లో, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుంచి ఎమ్మెల్యేలుగా నెగ్గారు. దీంతో మొత్తం నలుగురు లోక్ సభ ఎంపీలు.. తెలంగాణ మూడో శాసన సభలో అడుగుపెడుతున్నట్లయింది.

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు వెళ్తారా?

ప్రభాకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాలకు వెళ్తారా? అన్నది చూడాలి. ఎందుకంటే నాలుగున్నరేళ్లుగా వీరు లోక్ సభ సభ్యులుగా ఉన్నందున ఎంతో కొంత అనుబంధం ఏర్పడి ఉంటుంది. ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాలకు వెళ్లి సహచర సభ్యులను కలిసి గౌరవపూర్వకంగా రాజీనామా చేసి వస్తారని భావించవచ్చు. అందులోనూ సరిగ్గా శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రాజీనామా సమర్పించే అవకాశం రావడం కొంత కలిసివస్తుందనే అనుకోవాలి. ఎందుకంటే.. చాలా మంది సెషన్ లేని సమయంలో రాజీనామా చేయాల్సి వస్తుంది. దానికంటే.. సహచరులను కలిసి.. స్పీకర్ కు రిజైన్ ఇచ్చి రావడం బాగుంటుంది కదా..?

ఉప ఎన్నిక లేనట్లే..

రాష్ట్రంలో నలుగురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ.. వీరి ఎంపీ స్థానాల్లో ఉప ఎన్నికలకు అవకాశం లేదు. ఎందుకంటే.. లోక్ సభ పదవీ కాలం ముగియడానికి ఇంకా ఆరు నెలల వ్యవధి మాత్రమే ఉంది. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోపు ఎన్నికలుంటే ఉప ఎన్నిక నిర్వహించరు. దీంతో వచ్చే ఆరు నెలలు ఈ నాలుగు సీట్లూ ఖాళీగానే ఉంటాయన్నమాట. మరోవైపు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎంపీలందంరూ 14 రోజుల్లో రాజీనామా చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణం చేసే ముందు లోకసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించాల్సి ఉంటుంది. వీరిలో రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నారు కాబట్టి ఆయనే ముందుగా రాజీనామా చేస్తారు. ఉత్తమ్, కోమటిరెడ్డి కి మంత్రి పదవులు దక్కిన తర్వాత రాజీనామా చేస్తారని భావించవచ్చు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఇదే తీరున నిర్ణయం తీసుకోవచ్చు.

తెలంగాణ నుంచి కాంగ్రెస్ కు ఎంపీలు లేరు

రేవంత్, కోమటిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఎంపీలుగా పోటీ చేసి గెలిచారు. ఉత్తమ్ ఎమ్మెల్యేగా గెలిచినా, పార్టీ ఆదేశానుసారం ఎంపీగా బరిలో దిగారు. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి 2014 మెదక్ ఉప ఎన్నిక నుంచి ఎంపీగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ముగ్గురు ఎంపీలూ రాజీనామా చేస్తే.. ఆ పార్టీకి తెలంగాణ నుంచి ఎంపీలు లేనట్లే. బీఆర్ఎస్ 9మంది ఎంపీల్లో ఒకరు తగ్గుతున్నారు. ఇక బీజేపీ నలుగురు ఎంపీల్లో ముగ్గురు (అర్వింద్ , సంజయ్, బాపూరావు) అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసలు బరిలోకే దిగలేదు. అంటే బీజేపీకి తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలున్నట్లు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు ఒక్కరూ లేనట్లు (వచ్చే మే నెల వరకు).

కొసమెరుపు: మోదీ ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లోనే, బడ్జెట్ సమావేశాల్లోనో కీలక లేదా వివాదాస్పద బిల్లులు ప్రవేశపెడితే.. కాంగ్రెస్ వాటిని వ్యతిరేకిస్తే.. ఓటింగ్ జరిగితే.. కాంగ్రెస్ కు ముగ్గురు ఎంపీల బలం తగ్గుతుంది. ప్రభాకర్ రెడ్డినీ కలుపుకొంటే విపక్ష ఎంపీలు నలుగురు తగ్గుతారు.