ఈ దొంగలు మామూలు దొంగలు కాదు.. ఈ దొంగతనం మామూలుది కాదు!
ఈ లోగా ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
By: Tupaki Desk | 29 Feb 2024 1:30 PM GMTమనదేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అనే విషయం తెలిసిందే. ఈ పురస్కారం కింద పతకాన్ని ప్రదానం చేస్తారు.. ఎలాంటి నగదు బహుమతి ఉండదు.
కాగా తాజాగా ఢిల్లీలో దొంగలు ఒక మాజీ వైస్ చాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతాకాన్ని కొట్టేశారు. దాన్ని అమ్మకానికి పెట్టారు. అయితే దానిపైన పద్మభూషణ్ అని రాసి ఉండటంతో ఎవరూ దాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. ఈ లోగా ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
ఈ దొంగతనం వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ జీసీ చటర్జీ ఇంట్లో పద్మభూషణ్ పతకం దొంగతనానికి గురయింది. ఢిల్లీలోని కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకాన్ని అతని సహాయకుడు శ్రవణ్ కుమార్ దొంగిలించాడు.
చోరీ చేసిన పద్మభూషణ్ పతకాన్ని ఒక బంగారం దుకాణంలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా దొంగతనం విషయం బయటపడింది. ఈ మెడల్ పై పద్మభూషణ్ అని రాసి ఉండటంతో ఈ పతకాన్ని కొనుగోలు చేసేందుకు బంగారం షాప్ యజమాని తిరస్కరించాడు. దీంతో ఆ ముగ్గురు నిందితులు మరో గోల్డ్ షాపుకు వెళ్లారు.
అయితే అప్పటికే మొదటి బంగారం షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు పారిపోయారు. దీనిపై ఢిల్లీ ఆగ్నేయ జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ రాజేష్ దేవ్ మాట్లాడుతూ.. హరిసింగ్, రింకీ వేద్ ప్రకాష్ అనే ముగ్గురు స్నేహితులు పద్మభూషణ్ పతకాన్ని విక్రయించేందుకు కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నగల దుకాణం నడుపుతున్న దిలీప్ ను సంప్రదించారని వెల్లడించారు. ఈ క్రమంలో దిలీప్ ఈ విషయాన్ని కల్కాజీ పోలీసులకు తెలిపాడన్నారు.
పోలీసుల బృందం అక్కడికి చేరుకునేలోపే నిందితులు అక్కడి నుంచి పారిపోయారన్నారు. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తమై గాలించి ఆ ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.
నిందితులంతా మదన్ పూర్ ఖాదర్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మొత్తం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మదన్ పూర్ ఖాదర్ నివాసి శ్రవణ్ కుమార్ (33), హరి సింగ్ (45), రింకీ దేవి (40), వేద్ ప్రకాష్ (39), ప్రశాంత్ బిస్వాస్ (49) అని తెలిపారు. కాగా ప్రధాన నిందితుడు శ్రవణ్ కుమార్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత జిసి ఛటర్జీ ఇంట్లో మెడికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడని వెల్లడించారు.