Begin typing your search above and press return to search.

13 తర్వాత ఏరోజైనా...

అందుకనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకునేది నువ్వా-నేనా అని మూడుపార్టీల మధ్య పోటీ పెరిగిపోతోంది.

By:  Tupaki Desk   |   8 March 2024 4:40 AM GMT
13 తర్వాత ఏరోజైనా...
X

దేశం మొత్తం మీద ఎన్నికల వేడి బాగా పెరిగిపోతోంది. ఇందులో తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకమని చెప్పాలి. ఎలాగంటే తెలంగాణాలో పార్లమెంటు ఎన్నికలు మాత్రమే జరగబోతున్నాయి. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. తెలంగాణలో మొన్నటి డిసెంబర్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అందుకనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకునేది నువ్వా-నేనా అని మూడుపార్టీల మధ్య పోటీ పెరిగిపోతోంది. మొత్తం 17 సీట్లలో మెజారిటి సీట్లను గెలుచుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ పెరిగిపోతోంది.

ఇక ఏపి విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనతో జట్టుకట్టారు. అలాగే పొత్తులోకి బీజేపీని కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఏ విషయం తేలిపోతుంది. ఇదే సమయంలో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే జగన్, చంద్రబాబు ఇద్దరికీ రాబోయే ఎన్నికలు ఒకవిధంగా జీవన్మరణ సమస్యనే చెప్పాలి. జగన్ రెండోసారి కూడా ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు రాజకీయ జీవితానికి ముగింపు పడిపోవడం ఖాయం.

అలాగే పార్టీ చాలా ఇబ్బందులో పడుతుంది. పైగా లోకేష్ భవిష్యత్తు అగమ్యగోచరమైపోతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి పట్టించుకోవాల్సిన అవసరంలేదు. అదే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే జగన్ను చాలా సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. జగన్ అంటే మండిపోతున్న యాంటి జగన్ శక్తులన్నీ ఏకమై దాడులు మొదలుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, ఇద్దరికీ రకరకాల సమస్యలున్నాయి కాబట్టి వచ్చేఎన్నికల్లో గెలుపు ఇద్దరికీ అనివార్యమనే చెప్పాలి.

అందుకనే గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయాలు కలుషితమైపోయాయి. పార్టీలపరంగా కాకుండా జగన్, చంద్రబాబు, పవన్ రాజకీయవైరాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు. అందుకనే ఏపీలో రాజకీయలు పూర్తిగా గబ్బుపట్టిపోయాయి. ఈ నేపధ్యంలోనే పార్టీలన్నీ ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాయి. షెడ్యూల్ ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా ? అని ఆసక్తిగా ఆరా తీస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమీషనర్ ఆధ్వర్యంలో 11వ తేదీన వివిధ రాష్ట్రాల కమీషనర్లు, ఉన్నతాధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరపబోతున్నారు. కాబట్టి 13వ తేదీన ఏ రోజైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు.