ఇటు విహంగ విషాదం.. అటు మానవోన్మాదం.. వందల మంది మృతి!!
ఆకాశయానాలు ఆయువు తీస్తున్న పరిస్థితి ఇటీవల కాలంలో పెరిగిపోయింది.
By: Tupaki Desk | 10 Aug 2024 8:30 PM GMTఒక వైపు ప్రకృతి సహకరించక పోవడంతో జరిగిన ప్రమాదం.. మరోవైపు పేట్రేగిన అధికార వ్యామోహంతో జరిగిన దాడి వెరసి.. ఏకకాలంలో వందల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
విహంగ విషాదం..
ఆకాశయానాలు ఆయువు తీస్తున్న పరిస్థితి ఇటీవల కాలంలో పెరిగిపోయింది. బోలెడు డబ్బులు పోసి.. ఎంతో ఉత్సాహంగా విమానం ఎక్కిన ప్రయాణికులు.. గమ్యం చేరే వరకు ప్రాణాలు గుప్పిట పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల నేపాల్‌లో జరిగిన ఘటన మరిచిపోక ముందే.. తాజాగా బ్రెజిల్‌లో ఘోర విషాదం జరిగింది. ఏకంగా 62 మంది ప్రయాణికులు.. విమాన సిబ్బంది మొత్తం అందరూ ప్రాణాలు కోల్పోయారు.
బ్రెజిల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సావో పువాలోకు బయలు దేరిన విమానం.. కొన్ని క్షణాల్లో కుప్పకూలిపోయింది. గాలిలో గిరగిరా చక్కర్లు కొట్టిన విమానం.. ఒక్కసారిగా విన్‌హెడోలో కుప్పకూలి పోయిం ది. ఈ ఘటనలో మొత్తం 60 మంది ప్రయాణికులు సహా విమాన సిబ్బంది కూడా మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. స్థానిక కాల మానం ప్రకారం.. గత రాత్రి 11 గంటల తర్వాత ఈ ప్రమాదం సంభవించింది.
ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంపై అధ్యక్షుడు లుయూజ్ లులా డసి ల్వా హుటాహుటిన స్పందించారు. ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. సహాయ సిబ్బంది పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. అయితే.. అక్కడ వర్షం పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్టు సమాచారం.
మానవోన్మాదం..
హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తాజాగా 100 మందికి పైగా అమాయకులను ఇజ్రాయెల్ పొట్టనపెట్టుకుంది. తూర్పు గాజాలోని ఓ స్కూల్‌లో బాధితులు నిరాశ్రయం పొందుతున్నారు. అయితే.. ఈ ప్రాంతాన్నే లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ దళాలు.. బాంబులతో చెలరేగిపోయాయి. ఈ దాడుల్లో శనివారం ఉదయం నాటికి 102 మందికి పైగా నిరాశ్రయులు మృతి చెందారని తెలిసింది. ఇది పూర్తిగా మానవోన్మాదం. ఒకవైపు..చర్చలు అంటూనే మరోవైపు.. ఇలా ఊచకోతలు కోయడం దారుణమని ప్రపంచం గగ్గోలు పెడుతోంది.