డ్యామిట్ .. 'మాచర్ల' కథ రివర్స్ అయిందే!
ఆయన మీడియా ముందు రక్త గాయాలతోనే రావడాన్ని బట్టి అంతటి అధికారిని కూడా వదిలిపెట్టలేదని.. మాచర్లలో శాంతి భద్రతలు అడుగంటాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
By: Tupaki Desk | 1 Jun 2024 5:10 PM GMTఏపీ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారిన అంశం మాచర్ల. గత నెల 13న పోలింగ్ అనంతరం.. మాచర్ల ఒక యుద్ధ భూమిని తలపించింది. ఇక్కడి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేయడం.. దీనిని అడ్డుకున్న టీడీపీ ఏజెంట్‌ను బెదిరించి.. ఆపై హత్యాయత్నం కూడా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇక, స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్ నారాయణ స్వామిపై కూడా పిన్నెల్లి అనుచరులు.. హత్యాయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆయన మీడియా ముందు రక్త గాయాలతోనే రావడాన్ని బట్టి అంతటి అధికారిని కూడా వదిలిపెట్టలేదని.. మాచర్లలో శాంతి భద్రతలు అడుగంటాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
దీంతో పిన్నెల్లిపై వరుసగా రెండు హత్యా యత్నం కేసులు.. సహా ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులతోపాటు.. మరిన్ని కేసులు కూడా మోపారు. దీంతో ఆయన పారిపోవడం తెలిసిందే. ఇక, పోలీసులు ఆయన కోసం ప్రత్యేకంగా వెదికినా ఆయన ఎక్కడా కనిపించలేదు. చిత్రంగా ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వగానే.. పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించ గానే.. ఆయన కనిపించారు. అయితే.. కథ ఇక్కడితో అయిపోయిందని.. పిన్నెల్లిని తర్వాత.. అంటే జూన్ 6 తర్వాత అరెస్టు చేస్తారని అందరూ అనుకుంటున్నారు. అయితే.. తాజాగా ఈ ఎపిసోడ్ అడ్డం తిరిగింది. మాచర్ల ఘటనలకు సంబంధించి పిన్నెల్లి స్వయంగా కోర్టును ఆశ్రయించారు.
తనను హత్య చేసేందుకు టీడీపీ నాయకులు.. ప్రయత్నించారని.. ఈ విషయం తెలిసి కూడా.. సీఐ నారాయణ స్వామి చర్యలు తీసుకోలేదని.. పిన్నెల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే సీఐ నారాయణ స్వామిని.. విధులకు దూరంగా ఉంచాలని.. విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా.. సీఐ నారాయణ స్వామిని సస్పెండ్ చేశారు. అంతేకాదు.. ఆయనను విచారించేందుకు ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలని ఆదేశించారు. దీంతో మాచర్ల వివాదం అత్యంత కీలక మలుపు తిరిగినట్టయిందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో మున్ముందు ఎలాంటి పరిణామాలు వస్తాయో చూడాలి.