Begin typing your search above and press return to search.

20లోపే సీట్లు వస్తున్నప్పుడు ఏంటి పరిస్థితంటూ ఫోన్లు ఏల కేసీఆర్?

తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో 20 లోపు సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 5:45 AM GMT
20లోపే సీట్లు వస్తున్నప్పుడు ఏంటి పరిస్థితంటూ ఫోన్లు ఏల కేసీఆర్?
X

చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం సంబంధం ఉండదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు రాజకీయ ప్రముఖులు. ఇప్పుడు ఆ కోవలోకే వస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తాను పాల్గొంటున్న ఎన్నికల సభల్లో ప్రత్యర్థుల్ని పూచికపుల్లల మాదిరి తీసిపారేస్తూ.. తమ గెలుపు డిసైడ్ అయ్యిందని.. ప్రత్యర్థుల పని అయిపోయిందని.. తాము భారీగా గెలుస్తున్నట్లుగా జోస్యం చెబుతున్న గులాబీ బాస్.. తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో 20 లోపు సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంటున్నారు.

ఒకవేళ.. కేసీఆర్ మాటలే నిజం అనుకుందాం. మరి.. తమ గెలుపు అంత పక్కాగా ఉన్న వేళ.. గతానికి భిన్నంగా కేసీఆర్ ఎందుకంత ఎక్కువగా కష్టపడుతున్నారు. వివిధ ప్రాంతాలకు అదే పనిగా పర్యటిస్తూ ఓట్లు వేయాలని ఎందుకు అభ్యర్థిస్తున్నారు? ఓవైపు కేసీఆర్.. మరోవైపు కేటీఆర్.. హరీశ్ రావులు తెలంగాణ మొత్తం చుట్టేస్తున్న వైనం తెలిసిందే. ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఈసారి ప్రచారం మీద ఈ ముగ్గురు ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారం మీద ఎందుకు ఫోకస్ పెట్టినట్లు? అని ప్రశ్నిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పలువురు అభ్యర్థులకు ఫోన్లు చేసి.. రోజువారీగా ప్రచారం సాగుతున్న తీరుతో పాటు.. స్థానికంగా ఉన్న పరిస్థితుల గురించి గులాబీ బాస్ స్వయంగా ఆరా తీస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. గెలుపు మీద డౌట్ ఉన్న నియోజకవర్గాలకు నిత్యం ఫోన్ చేయటం.. అభ్యర్థులతో రోజు మాట్లాడటంతో పాటు.. సమన్వయ లేమిని ప్రశ్నిస్తూ.. దాన్ని సరి చేసుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు కేసీఆర్.

నిజంగానే 20 లోపు స్థానాలకే కాంగ్రెస్ పరిమితమయ్యే పరిస్థితే ఉంటే.. కేసీఆర్ ఇంతలా ఎందుకు ఆరాట పడతారని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తమ కారు మాంచి జోరు మీద ఉన్నట్లు చెప్పుకునే గులాబీ అధినాయకత్వం మాటలకు భిన్నంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులతో మాట్లాటం.. ఎన్నికల వేళ బయటకు వచ్చిన లోపాల్ని ప్రస్తావిస్తూ.. వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న సూచనలు చేయటం గమనార్హం. అంతేకాదు.. స్థానికంగా నేతలతో అభ్యర్థులకు ఉన్న పంచాయితీలను ప్రస్తావిస్తూ.. వాటిని వెంటనే క్లోజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా అభ్యర్థుల లోటుపాట్లపై రోజువారీగా రివ్యూ చేస్తున్న కేసీఆర్ తీరు చూసినప్పుడు.. ఎన్నికల్లో గెలుపు మాటల్లో చెప్పినంత సులువుగా లేదన్న విషయం స్పష్టమైనట్లుగా చెప్పక తప్పదు.