జూన్ 25..''రాజ్యాంగం హత్య''.. కేంద్ర ప్రభుత్వ సంచలన ప్రకటన
ఇప్పుడు ఆ జూన్ 25 ఏకంగా రాజ్యంగం హత్య జరిగిన రోజుగా మారనుంది.
By: Tupaki Desk | 12 July 2024 11:48 AM GMTభారతీయులకు జూన్ 25వ తేదీ చాలా ప్రత్యేకం. భారత క్రికెట్ జట్టు 1980లో జూన్ 25నే వన్డే ప్రపంచ కప్ ను తొలిసారిగా గెలిచింది. దీంతో ప్రపంచ క్రికెట్ చరిత్రనే కాదు.. భారత క్రికెట్ చరిత్ర కూడా మారిపోయింది. మరోవైపు జూన్ 25కు ఇంతకంటే చాలా నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం కూడా భారత దేశ చరిత్రను మార్చేసింది. ఇప్పుడు ఆ జూన్ 25 ఏకంగా రాజ్యంగం హత్య జరిగిన రోజుగా మారనుంది.
అప్పట్లో ఏం జరిగింది..?
అది దేశాన్ని ఇందిరాగాంధీ వంటి శక్తిమంతురాలైన నాయకురాలు ప్రధానిగా ఏకధాటిగా పాలిస్తున్న రోజులు. అయితే, రాయ్ బరేలీ నుంచి ఆమె ఎన్నికలో అక్రమాలు జరిగినట్లు అలహాబాద్ హై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో ఇందిరాగాంధీ ప్రధాని పదవి దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ.. ఇందిర ఏకంగా 1975 జూన్ 25న ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) ప్రకటించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎమర్జెన్సీ అంటే మాటలు కాదు కదా.
హక్కులు హననం
1975 జూన్ 25 నుంచి ఎమర్జెన్సీ 18 నెలలు కొనసాగింది. దీంతోనే దేశంలో అధికారాలన్నీ సెంట్రలైజ్జ్ అయ్యాయి. మీడియా స్వేచ్ఛను హరించారు. పత్రికలను సంపాదకీయాలను ముందుగానే చూపాలనే నిబంధన తెచ్చారు. మరోవైపు ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ పేరిట ఆయన మద్దతుదారులు హల్ చల్ చేశారు. పిల్లలు పుట్టకుండా మగవారిని బలవంతంగా తీసుకెళ్లి ఆపరేషన్లు చేశారని చెబుతారు. ఇంకా వేలాదిమంది ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెట్టారు.
రాజ్యాంగ హత్య దినంగా ఎందుకంటే?
ఇటీవలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్ష ఇండియా కూటమి బాగా బలంగా మారింది. దీంతోపాటు ఎంపీల ప్రమాణ స్వీకారానికి ఉద్దేశించిన ప్రత్యేక సమావేశాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలంతా రాజ్యాంగ ప్రతులను పట్టుకుని వచ్చి మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎండగట్టారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ విలువలపై చర్చ జరుగుతోంది. వీటికి అడ్డుకట్టనా.. అన్నట్లు కేంద్ర ప్రభుత్వం జూన్ 25ని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించింది. గతంలోనూ, ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోదీ.. ఎమర్జెన్సీ గురించి పదేపదే ప్రస్తావించి కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శించారు.
కాగా,కేంద్రం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ''1975 జూన్ 25న ప్రజాస్వామ్య ఆత్మను ఇందిరాగాంధీ ప్రభుత్వం హత్య చేసింది'' అని పేర్కొంది.