కేసీఆర్.. రేవంత్ నడుమ కామారెడ్డిలో మూడో అభ్యర్థి ప్రత్యేకత తెలుసా?
వాస్తవానికి కేసీఆర్ ఈ సారి పోటీ చేయబోయే నియోజకవర్గం ఇది అంటూ.. చాలా పేర్లు బయటకు వచ్చాయి.
By: Tupaki Desk | 24 Nov 2023 11:54 AM GMTసరిగ్గా ఆరు నెలల కిందటి వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం గురించి పెద్దగా మీడియాలో వచ్చేది కాదు. అక్కడినుంచి వరుసగా గెలిచిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎలా ఉంటారో కూడా మిగతా జిల్లాల్లోని ప్రజలకు తెలియదు. కానీ, ఎప్పుడైతే సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని కథనాలు వచ్చాయో.. అప్పుడే ఆ నియోజకవర్గం ఎక్కడ ఉందా? అని వెదకడం మొదలుపెట్టారు. వాస్తవానికి కేసీఆర్ ఈ సారి పోటీ చేయబోయే నియోజకవర్గం ఇది అంటూ.. చాలా పేర్లు బయటకు వచ్చాయి. కామారెడ్డి, నల్లగొండ, జనగామ, మునుగోడు, ఆలేరు.. ఇలా ఐదారు సీట్ల పేర్లు వినిపించాయి. వీటిలో కామారెడ్డిని బీఆర్ఎస్ అధినేత ఎంచుకున్నారు.
రేవంత్ రాకతో కాక..
గజ్వేల్ తో పాటు కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయాలనుకోవడమే అనూహ్యమైతే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీకి దిగి కాక రేపారు. వీరిమధ్యన ముఖాముఖి సమరంలో విజేత ఎవరో తేల్చేందుకు అనేక విశ్లేషణలు చేస్తున్నారు. డబ్బు పంపిణీ, సామాజికవర్గ ప్రభావం, కేడర్ బలం ఇలా అనేక రకాలుగా అంచనా వేస్తున్నారు. అయితే, వీరిద్దరూ కాకుండా కామారెడ్డిలో మూడో అభ్యర్థి కూడా ఉన్నారనే సంగతిని పెద్దగా పట్టించుకోవడం లేదు.
సొంత మేనిఫెస్టోతో..
వివిధ కారణాల వల్ల తెలంగాణలో బీజేపీ ఎన్నికల్లో వెనుకబడి ఉండొచ్చు. నాయకత్వంలో దూకుడు తగ్గి ఉండొచ్చు. కానీ, కామారెడ్డి బీజేపీ అభ్యర్థి మాత్రం కాస్త వ్యక్తిగతంగా పేరున్నవారే. ఆయన పేరు కాటిపల్లి వెంకట రమణారెడ్డి. బయటివారికి తెలియకున్నా.. రమణారెడ్డి కామారెడ్డి ప్రజలకు సుపరిచితుడు. గత ఎన్నికల్లో కామారెడ్డిలో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు కూడా. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేసిన వెంకటరమణారెడ్డి ఆర్థికంగా బలమైన నాయకుడు. ఓడిపోయినా.. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ముందుగానే నిర్ణయించుకున్న వెంకటరమణారెడ్డి మరోవైపు కేసీఆర్ పోటీ చేస్తారని తెలిసినా వెనక్కుతగ్గలేదు. కాగా, ఎన్నికల్లో సొంతంగా మేనిఫెస్టో ప్రకటించడం వెంకటరమణారెడ్డి ప్రత్యేకత. ఇంకో గమనార్హమైన విషయం ఏమంటే.. గజ్వేల్ లో కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను దింపిన బీజేపీ.. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి వంటి నాయకుడిపై విశ్వాసం ఉంచడం.
ముక్కోణంలో మొగ్గెవరికో..?
కామారెడ్డి నుంచి నాలుగుసార్లు వరుసగా గెలిచిన గంప గోవర్ధన్ రెండు టర్మ్ ల బీఆర్ఎస్ పాలనలో మంత్రి కాలేదు. ఈసారి అధినేత కేసీఆర్ పోటీతో గోవర్ధన్ రంగంలోనే లేరు. గోవర్ధన్ చిరకాల ప్రత్యర్థి అయిన షబ్బీర్ అలీ.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి తరలిపోయారు. 2018లో పోటీచేసిన వారిలో వెంకటరమణారెడ్డి ఒక్కరే ఉన్నారు. గత ఎన్నికల్లో 15,439 ఓట్లు సాధించారు. ఇవి పోలైన ఓట్లలో దాదాపు పదిశాతం. షబ్బీర్ అలీపై గోవర్ధన్ సాధించిన మెజార్టీ కూడా 5,007 ఓట్లే కావడం గమనార్హం. మరి ఈసారి కేసీఆర్-రేవంత్ రెడ్డి మధ్య వెంకటరమణారెడ్డి ఎన్ని ఓట్లు సాధిస్తారో..? అవి ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో..? డిసెంబరు 3న తేలనుంది.