Begin typing your search above and press return to search.

ఎన్నికల కోడ్‌ కథ.. కమామిషు ఇదీ!

ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలక భూమిక పోషించే ఎన్నికల కోడ్‌ కు 1960లోనే అడుగులు పడ్డాయని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 March 2024 9:12 AM GMT
ఎన్నికల కోడ్‌ కథ.. కమామిషు ఇదీ!
X

కీలకమైన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ కు మరికొద్ది గంటల్లో తెర లేవనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ ను ప్రకటించనున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ను ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎన్నికల కోడ్‌ ఎలా మొదలైంది.. ఎప్పుడు దీనికి బీజాలు పడ్డాయి అనే విషయాలు అందరికీ ఆసక్తికరం!

ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలక భూమిక పోషించే ఎన్నికల కోడ్‌ కు 1960లోనే అడుగులు పడ్డాయని తెలుస్తోంది. నాడు కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తొలిసారి ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ కు బీజం పడి దాదాపు 64 ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ విశేషాలివి..

ఎన్నికల సమయంలో పార్టీలు, అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలు, నిబంధనలే ఎన్నికల కోడ్‌. ఎన్నికలకు సంబంధించి అన్ని భాగస్వామ్య పక్షాలు ఏకాభిప్రాయంతో రూపొందించిన నిబంధనల స్వరూపమే... ‘మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌’.

సరైన పద్ధతుల్లో, శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడం, పోలింగ్, కౌంటింగ్‌ జరగడమే మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉద్దేశం. అధికారంలో ఉన్న పార్టీ.. ప్రభుత్వ యంత్రాంగం, ఆర్థిక వనరుల దుర్వినియోగం చేయకుండా అరికట్టడం కూడా ఎన్నికల కోడ్‌ ముఖ్య ఉద్దేశం.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రచారానికి తమ అధికారాలను ఉపయోగించుకోకూడదని ఎన్నికల నియమావళి వెల్లడిస్తోంది. మంత్రులు, ఇతర ప్రభుత్వ అధికారులు ఏ రూపంలోనూ ఆర్థిక నిధులను ప్రకటించడం కుదరదు. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఓటరును ప్రభావితం చేసే ఏ ప్రాజెక్టు, పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించడానికి వీలుండదు. మంత్రులు కూడా ప్రచారం కోసం అధికారిక యంత్రాంగాన్ని ఉపయోగించడానికి అనుమతి ఉండదు.

ఎన్నికల కోడ్‌.. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు అమలులో ఉంటుంది. అయితే ఎన్నికల కోడ్‌ కు ఎలాంటి చట్టబద్ధత లేనప్పటికీ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో దీన్ని సమర్థించింది. కోడ్‌ ఉల్లంఘిస్తే.. దర్యాప్తు జరిపి, శిక్ష విధించడానికి ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉంటుందని పేర్కొంది.

కాగా దేశంలో 1968–69లో జరిగిన మధ్యంతర ఎన్నికల సమయంలో ‘మినిమమ్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌’ పేరుతో సెప్టెంబర్‌ 26, 1968లో ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి అమల్లోకి తెచ్చింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల పాత్ర, వాటి బాధ్యతలు అనే పేరుతో దీన్ని తెచ్చింది.

ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ లో పలు మార్పులు జరిగాయి. 1972, 1982, 1991, 2013లో ఎన్నికల కోడ్‌ నియమావళిలో కొన్ని మార్పులు జరిగాయి. అధికారంలో ఉన్న పార్టీల తీరుపై పర్యవేక్షణ అంశాన్ని 1979లో చేర్చారు. అలాగే ప్రవర్తనా నియమావళికి చట్టబద్ధత లేకపోవడంతో దీనికి చట్టబద్ధత కల్పించాలంటూ 2013లో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. అదేవిధంగా ఎన్నికలను ప్రకటించినప్పుడు కాకుండా నోటిఫికేషన్‌ విడుదలైనప్పటినుంచి కోడ్‌ అమలులోకి తేవాలని సూచించింది. అలాగే అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిపై మరింత స్పష్టత తెచ్చేందుకు సవరణ చేయాలని సిఫారసు చేసింది. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు ద్వారా ఎన్నికల వివాదాలను 12 నెలల్లో పరిష్కరించడం వంటి సవరణలను చేయాలని కేంద్రానికి సూచించింది.

కాగా ఎన్నికల ప్రవర్తన నియమావళికి చట్టబద్ధత కల్పిచేందుకు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌వై ఖురేషీ.. తన పదవీకాలంలో తీవ్రంగా కృషి జరిపారు. నిబంధనలు ఉల్లంఘించే రాజకీయ నాయకులపై కఠిన చర్యలు ఉండాలన్నారు.