అప్పుడు ధర్మారెడ్డి.. ఇప్పుడు చౌదరి.. టీటీడీకి కావాల్సిందేంటి?
ఇదీ.. ఇప్పుడు ప్రశ్న. అధికారులను మార్చడం వరకు పరిమితం అవుతురన్నా? ఇది మరో సందేహం.
By: Tupaki Desk | 17 July 2024 9:48 AM GMTకలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుతామని.. వైసీపీ హయాంలో భ్రష్టు పట్టిపోయిన తిరుమలకు రక్షణ కవచాలను అందిస్తామని.. ఎన్నికలకు ముందు చెప్పిన.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. ఏం చేస్తున్నారు? నిజంగానే తిరుమలలో మార్పుల దిశగా ఆయన అడుగులు వేస్తున్నారా. ఇదీ.. ఇప్పుడు ప్రశ్న. అధికారులను మార్చడం వరకు పరిమితం అవుతురన్నా? ఇది మరో సందేహం.
చంద్రబాబు వచ్చీరావడంతోనే ఇంచార్జ్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని పక్కకు తప్పించారు. ఆయన ఐఆర్ ఎస్ అదికారి అని.. కేవలం `రెడ్డి` ట్యాగ్ ఉండడంతోనే ఆయనను తిరుమలలో నియమించారని టీడీపీ నాయకులు కూడా విమర్శలు గుప్పించారు. దీనిలో నిజం ఉండే ఉంటుంది. కానీ, ఇప్పుడు చేస్తున్నది కూడా.. అదే కదా! అప్పట్లో రెడ్డి అధికారి ఉన్నాడని.. చెబుతున్న టీడీపీ.. అధినేత, ఇప్పుడు చౌదరిని తీసుకువచ్చారు. ధర్మారెడ్డి డిఫెన్స్ అధికారి అయితే.. ఇప్పుడు తీసుకువచ్చిన ఆయన ఐఆర్ ఎస్ అధికారి.
తాజాగా కేంద్రంలో పనిచేస్తున్న ఐఆర్ ఎస్(ఇండియన్ రెవెన్యూ సర్వీస్) అధికారి వెంకయ్య చౌదరని తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్‌గా అధికారిగా నియమిస్తున్నారు. కానీ, తిరుమలకు ఉన్న ప్రత్యేక నిబం ధనలను పరిశీలిస్తే.. ఎండో మెంట్ విభాగంలో సీనియర్ అయిన అధికారి.. కనీసం 10 సంవత్సరాలకు తక్కువ కాని సీనియారిటీ ఉన్న అధికారిని జేఈవోగా నియమించాలి. కానీ, ఈ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు.
ఒక్క అన్నగారు ఎన్టీఆర్ హయాంలో మాత్రమే.. తిరుమలకు ప్రత్యకంగా రాసుకున్న రాజ్యాంగం (తిరుమల భాషలో నియమాలు) ప్రకారం.. ఎండోమెంట్‌లో పదిహేనేళ్లు పనిచేసిన.. అధికారి ఎస్వీఆర్‌ను జేఈవోగా నియమించారు. ఫలితంగానే.. తిరుమల విస్తరణ, నిత్యాన్నదానం, వైకుంఠం క్యూ కాంప్లెక్సులు వంటివి ఏర్పడ్డాయి. అంతేకాదు.. ఎలాంటి ఆర్జిత సేవా టికెట్ తీసుకున్నా.. సామాన్యులతో కలిసే శ్రీవారిని దర్శించుకునే నిబంధన(శ్రీవారి ముందు అంతా సమానం) పక్కాగా అమలైంది. ఆ స్పూర్తిని ఇప్పుడు కొనసాగించకుండా.. మళ్లీ ఐఆర్ ఎస్ అధికారిని తీసుకురావడం వల్ల తిరుమలకు ఒరిగేది ఏంటి? అనేది ప్రశ్న.