ఎంపీలుగా ఓడినా ప్రధానులు అయిన ఆ ముగ్గురూ ..!?
అదే ఓటమి నుంచి విజయ లక్ష్మి పిలుపు అందుకున్నారు.
By: Tupaki Desk | 16 April 2024 4:30 PM GMTవారు ఎంపీలుగా ఓటమి చవి చూశారు. సాధారణంగా ఓటమి అంటే ఇక అంతటితో సరి అని అనుకుంటారు. కానీ వారు మాత్రం అక్కడే ఆగిపోలేదు. అదే ఓటమి నుంచి విజయ లక్ష్మి పిలుపు అందుకున్నారు. భారత దేశ రాజకీయ చరిత్రలో దిగ్గజ నేతలుగా వారు అయ్యారు. వారిలో ఇద్దరు భారత రత్నలు కావడం విశేషం. వారే మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్ పేయ్, అలాగే పీవీ నరసింహారావు, చంద్రశేఖర్. ఈ ముగ్గురూ ఎంపీలుగా ఓడిపోయి పీఎం లు అయ్యారు.
వీరి రాజకీయ జీవితాన్ని ఒక్కసారి తరచి చూస్తే ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. ముందుగా వాజ్ పేయ్ విషయానికి వస్తే ఇందిరా గాంధీ దారుణ హత్య తరువాత జరిగిన ఎన్నికల్లో వాజ్ పేయ్ ఎంపీగా ఓటమి పాలు అయ్యారు. గ్వాలియర్ నుంచి వాజ్ పేయ్ పోటీ చేస్తే కాంగ్రెస్ అభ్యర్ధిగా నాడు పోటీ పడిన మాధవరావు సింధియా ఆయను ఓడించారు. అది జరిగిన పన్నెండేళ్ళకు అంటే 1996లో వాజ్ పేయ్ భారత దేశానికి ప్రధాని అయ్యారు. ఇది నిజంగా గొప్ప రాజకీయ విజయంగానే అంతా చూస్తారు.
ఇక మరో దిగ్గజ నేత ఉన్నారు. ఆయనే పీవీ నరసింహారావు. ఆయన అదే 1984లో పీవీ నరసింహారావు తెలంగాణాలోని హనుమకొండలో పోటీ చేస్తే ఆయన్ని బీజేపీ అభ్యర్ధి జంగారెడ్డి ఓడించారు. ఏకంగా 54, 198 ఓట్ల తేడాతో పీవీ ఆ ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. కాలం గట్టిగా ఏడేళ్ళు తిరగకుండానే 1991లో అదే పీవీ భారత దేశానికి ప్రధాని అయి ఏకంగా అయిదేళ్ల పాటు జన రంజకమైన పాలన అందించారు. ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు నడిపించడం, ఆర్థిక సంస్కరణలను తీసుకుని రావడం అన్నది పీవీ గొప్పతనంగా ఇప్పటికీ చెప్పుకుంటారు
ఇక చంద్రశేఖర్ విషయానికి వస్తే ఆయన సొంత సీటు బల్దియా. అది యూపీలో ఉంది. అక్కడ నుంచి అనేక సార్లు గెలుస్తూ వచ్చిన చంద్రశేఖర్ 1984 ప్రాంతంలో పోటీ చేస్తే కాంగ్రెస్ కి చెందిన జగన్నాధ్ చౌదరి చంద్రశేఖర్ ని ఏకంగా 53 వేల 940 ఓట్ల తేడాతో ఓడించారు. దాంతో ఇక చంద్రశేఖర్ రాజకీయ జీవితం సరి అనుకున్నారు. అయితే 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కావడం వీపీ సింగ్ ప్రధానిగా పదకొండు నెలల పాటు పాలిచిన తరువాత కుప్ప కూలడంతో ఆ తరువాత ఏడు నెలల పాటు చంద్రశేఖర్ దేశానికి ప్రధాని అయ్యారు. ఆయన జీవిత కాలం కోరిక ఆ విధంగా తీరింది.
రాజకీయంగా సమర్ధుడు అయిన చంద్రశేఖర్ ప్రధాని కావాలని ఎంతగానో తపించారు. కానీ ఇక ఎంపీగా ఓటమితో ఆయన గెలవలేరు. ఇక రాజకీయంగా అడుగు ముందుకు పడదు అని అని అంతా అనుకున్నారు. కానీ చంద్రశేఖర్ ప్రధాని అయి తన జాతకం బలం ఏంతో అందరికీ చూపించారు ఇలా ఈ ముగ్గురు దిగ్గజ నేతలు ఎంపీలుగా ఓడినా పీఎంలుగా రాణించారు. అంతే కాదు ఈ ముగ్గురి మధ్య మంచి స్నేహం ఉంది. వాజ్ పేయ్ ని గురూజీ అని చంద్రశేఖర్ సంభోదించేవారు. పీవీ వాజ్ పేయ్ కి మంచి స్నేహితుడు. ఇలా ముగ్గురూ మిత్రులూ దేశానికి సారధ్యం వహించడం అది తొంబై దశకంలోనే కావడం భారత దేశ రాజకీయాల్లో విశేషంగానే చూస్తారు అంతా.