సెక్యులరిస్టులు.. ముస్లిం మేధావులు గొంతు విప్పాల్సిన టైం వచ్చేసింది!
ఒకరు ఒక కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానిస్తే అందుకు వెళ్లటం తప్పు ఎలా అవుతుంది
By: Tupaki Desk | 30 Jan 2024 8:30 AMసరైన సమయం వచ్చింది. నిత్యం నీతి వాక్యాలు బోధించే వారికి పరీక్షా కాలమే. దేశంలో మత సామరస్యంతో పాటు.. అందరిని కలుపుకుపోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. నిత్యం ఒక వర్గం మాత్రమే మరో వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉండకూడదు. తమ మేధోతనంతో ఇట్టే తీర్పులు ఇచ్చే పెద్ద మనుషులు నోరు విప్పాల్సిన సమయం వచ్చేసింది. అయోధ్యలోని బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ముస్లిం పెద్దాయన ఉమర్ అహ్మద్ ఇల్ యాసికి ఫత్వా జారీ చేసిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఒకరు ఒక కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానిస్తే అందుకు వెళ్లటం తప్పు ఎలా అవుతుంది. శత్రువు సైతం ఇంటికి వచ్చినప్పుడు వారికి మర్యాద చేయాలన్నది భారత ధర్మం. అది మనకు మాత్రమే ప్రత్యేకం. అలాంటప్పుడు అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం పంపినప్పుడు వెళ్లకుండా ఉండటం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపినట్లు అవుతుంది. ఈ దేశంలో అందరూ కలిసి ఉండాలన్న భావనను వ్యక్తం చేసే ఏ అవకాశాన్ని ఏ వర్గానికి చెందిన ప్రముఖులైనా విడిచి పెట్టకూడదు.
మిగిలిన దేశాలకు భిన్నంగా భారత్ లో మత విద్వేషం తక్కువ. కానీ.. కొందరి దుర్మార్గం వల్ల.. మరికొందరి రాజకీయ ప్రయోజాల కారణంగా మతాల మధ్య మేధావి తరహాలో చిచ్చు పెట్టే వైనం కనిపిస్తుంది. ఎప్పుడైనా.. ఏదైనా జరిగినంతనే బయటకు వచ్చేసి.. పెద్ద మనుషుల తరహాలో తీర్పులు ఇచ్చే మేధావులు.. తమకు తాము లౌకిక వాదులమన్న ట్యాగ్ తగిలించే వారు.. ఈ రోజు ముస్లిం పెద్దాయనకు ఫత్వా జారీ చేయటంపై నోరెత్తకుండా ఉండిపోయారెందుకు?
ఎవరో అనామకుడు చేసిన పనిని ఖండించాల్సిన అవసరం లేదన్నట్లుగా గొణిగే వారు.. అదే ధోరణిని మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఎందుకు పరిగణలోకి తీసుకోరు. ఎవరు అవునన్నా కాదన్నా.. ఈ దేశంలో హిందువులు.. ముస్లింలు కలిసి జీవించాల్సిందే. ఇది అనివార్యం. చేతి వేళ్లు ఐదు ఒక్కటిలా ఉండనట్లే..ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్యే సరిగా పొసగని ప్రపంచంలో.. రెండు భిన్న మతాలకు చెందిన వారి మధ్య సోదరభావం ఈ దేశానికి చాలా అవసరం.
ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ.. ఒకరి విశ్వాశాల్ని మరొకరు అభిమానించటం ద్వారా పెరిగే దూరాన్ని తగ్గించుకునే వీలు ఉంటుంది. అందుకు భిన్నంగా విద్వేషాన్ని పెంచి పోషించి.. నిత్యం నూరిపోసే వారి కారణంగా అశాంతి తప్పించి శాంతి.. సహజీవనం లాంటివి ఉండవన్నది మర్చిపోకూడదు. అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్ఠ అంశాన్ని కాసేపు పక్కన పెడదాం. హిందువులు.. ముస్లింల మధ్య ఒక పెద్ద వివాదం చెలరేగింది. చివరకు ముస్లింలకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. దానికి సంబంధించిన నిర్మాణాన్ని పూర్తి చేసి.. దానికి హిందువు ప్రముఖుల్ని ఆహ్వానిస్తే.. అలా వెళ్లిన వారికి బెదిరింపులు జారీ చేస్తే.. వారిని అతివాదులుగా.. మతమూఢులుగా ముద్ర వేయటం తెలిసిందే.
అలాంటి పరిస్థితే ఈ రోజున అఖిల భారత ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ విషయంలో చోటు చేసుకున్నప్పుడు లౌకిక వాదులు.. ముస్లిం వర్గాలకు చెందిన వారంతా ఈ తీరును ఎందుకు తప్పు పట్టరు? ఆయనకు అండగా ఉండాలి కదా? తన వాదనను ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఈ దేశంలో మతసామరస్యం మాత్రమే వర్గాల మధ్య ఉండే దూరాన్ని తగ్గించేలా చేస్తుంది. ఎవరు ఏ మతాన్ని ఆచరించినా.. చివరకు అందరం భారతీయులమే అవుతాము తప్పించి మరొకరు కాదు కదా?
అలాంటప్పుడు కొన్ని విషయాల్లో పట్టువిడుపులు తప్పనిసరి. దూరంగా ఉండటం ద్వారా ఆ దూరం మరింత పెరుగుతుందే తప్పించి తగ్గదన్న చిన్న లాజిక్ ముస్లిం మేధావులకు ఎందుకు కలగటం లేదు. స్నేహహస్తాన్ని చాచి.. దానికి సానుకూల స్పందన రాకుంటే తప్పు పట్టాలి. అంతేకానీ.. స్నేహ హస్తాన్ని చాచే ప్రయత్నం చేసే వారికి వార్నింగ్ లు ఇచ్చే ధోరణిని ఖండించకుండా ఉండటం ద్వారా పెద్ద తప్పు చేస్తున్న విషయాన్ని లౌకిక వాదులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ముస్లిం పెద్దాయనపై జారీ అయిన ఫత్వాపై గొంతు విప్పుతారా?