ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు పోవటానికి కారణమైన ‘టిప్పర్’ ఇదే
చిన్న వయసులో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఆమె మరణానికి అసలు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు ఫోకస్ చేశారు.
By: Tupaki Desk | 2 March 2024 5:02 AM GMTఅనూహ్య రీతిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు పోగొట్టుకున్న విషాద ఉదంతం గురించి తెలిసిందే. చిన్న వయసులో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఆమె మరణానికి అసలు కారణం ఏమిటన్న దానిపై పోలీసులు ఫోకస్ చేశారు. తాజాగా ఆమె ప్రాణాలు పోవటానికి కారణమైన వాహనాన్ని గుర్తించారు.
ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు చెందిన టిప్పర్ (టీఎస్ 08 యూజే 0025)ను లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు, టిప్పర్ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో ఆమె కారు వెనుక సీట్లో కూర్చొని ఉండటం.. సీటు బెల్టు పెట్టుకోకపోవటంతో ఆమెకు బలమైన గాయాలు తగిలి ప్రాణాలు పోయిన పరిస్థితి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రామేశ్వరం బండ సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకోవటం తెలిసిందే.
టిప్పర్ ను ఢీ కొన్న తర్వాత ఓఆర్ఆర్ రెయిలింగ్ ను ఢీ కొట్టింది. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో ఔటర్ రింగ్ రోడ్డులో ఏయే వాహనాలు ప్రయాణించాయన్న విషయాన్ని భారీ ఎత్తున వడబోసిన పోలీసులు.. వాటి డ్రైవర్లను విచారించారు. చివరకు టీఎస్ 08 యూజే 0025 టిప్పర్ ను గుర్తించారు.
ఈ టిప్పర్ వెనుక భాగంలో ఉన్న సిగ్నల్ లైటు బోర్డు పగిలిపోయి ఉండటం.. కొద్దిగా పై భాగంలో ఉన్న ఇనుప రాడ్ పక్కకు వంగిపోయి ఉండటం ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఇదేనని పోలీసులు గుర్తించారు. టిప్పర్ వెనుక భాగాన్ని లాస్య నందిత కారు ఢీ కొట్టిన విషయాన్ని డ్రైవర్ గుర్తించారా? లేదా? అన్నది విచారిస్తున్నారు. మనకెందుకులే అన్న ఉద్దేశంతో అక్కడి వెళ్లిపోయారా? అన్న కోణంలోనూ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొన్నిరోజుల్లో ఈ అంశం పైనా స్పష్టత వస్తుందని చెబుతున్నారు.