కమాండర్ ఖాసిం కోసం... ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర!?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 July 2024 4:50 AM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై 20 ఏళ్ల యువకుడు థామస్ మాథ్యూ క్రూక్స్ తుపాకీతో దాడికి పాల్పడటం, ఆ దాడిలో ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడటం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర అనే వెర్షన్ తెరపైకి వచ్చింది.
అవును... అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అలాంటి చర్చ తెరపైకి రావడానికి బలమైన కారణమే ఉంది. ఈ మేరకు దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందిందని అంటున్నారు. దీంతో... కమాండర్ ఖాసిం కోసం ఇరాన్ రివేంజ్ ప్లాన్ చేసి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు.
పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటనకు కొన్ని వారాల క్రితమే... ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర చేస్తుందనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందిందంట. దీంతో... సీక్రెట్ సర్వీస్ ఆయన భద్రతను పెంచింది. ఇదే సమయంలో... ట్రంప్ పై హత్యాయత్నం చేసిన మాథ్యూ క్రూక్స్ కు, ఇరాన్ కుట్రతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు కన్ఫాం చేసుకున్నారని అంటున్నారు.
అయినప్పటికీ... ఈ యువకుడి రూపంలో కాకపోయినా మరో రూపంలో అయినా ఇరాన్ కుట్ర పన్ని ఉంటుందని అంటున్నారు. ట్రంప్ కు పొంచి ఉన్న ముప్పుకు సంబంధించి తమకు నిరంతరం సమాచారం అందుతోందని సీక్రెట్ సర్వీస్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ బెదిరింపునూ చాలా తీవ్రంగా పరిగణిస్తామని, అంతే వేగంగా రియాక్ట్ అవుతామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే ట్రంప్ సహా ఆయన అధికారంలో ఉన్న సమయంలోని పలాకులకు ఇరాన్ నుంచి ఉన్న ముప్పుపై యూఎస్ భద్రతా అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ అధికారి వెల్లడించారు. అయితే తమపై వస్తోన్న ఆరోపణలపై ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ తీవ్రంగా ఖండించింది.
కాగా... ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో... ఇరాన్ సుప్రీం కమాండర్ ఖాసిం సులేమానీ ని డ్రోన్ దాడిలో అమెరికా హతమార్చింది. అప్పటి నుంచీ డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర అంటూ ఇంటెలిజెన్స్ సమాచారం అందుతొందని అంటున్నారు!