Begin typing your search above and press return to search.

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం మోడీ డేంజర్ బెల్?

తాము నిజమని అనుకున్నదే వాస్తవం అంటూ అందరికి ప్రచారం చేయటం మరో ఎత్తు.

By:  Tupaki Desk   |   13 July 2024 1:26 PM GMT
ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం మోడీ డేంజర్ బెల్?
X

గాలి వాటున అభిప్రాయాలు చెప్పే ధోరణి ఇటీవల కాలంలో మీడియాలో బలంగా వినిపిస్తోంది. చూసినంతనే.. విన్నంతనే అనిపించేదే వాస్తవమన్నట్లుగా అనుకోవటం ఒక ఎత్తు. తాము నిజమని అనుకున్నదే వాస్తవం అంటూ అందరికి ప్రచారం చేయటం మరో ఎత్తు. గడిచిన కొంతకాలంగా రెండో ట్రెండ్ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన నెల వ్యవధిలోనే జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించటంపై వెల్లువెత్తుతున్న మీడియా రిపోర్టులు చూస్తే కాసింత ఆశ్చర్యానికి గురి చేయక మానవు.

అదెలా? అన్న విషయాన్ని చెప్పే ముందు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ చోటు చేసుకున్న ఒక పరిణామాన్ని గుర్తు చేసి.. తాజా ఉప ఎన్నికల ఫలితాలు.. దాని విశ్లేషణ మీద మాట్లాడుకుంటే మరింత బాగా అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజున చూస్తే.. మోడీ సర్కారు ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమన్న విషయం మీడియా సర్కిల్స్ లోని అందరికి.. ముఖ్యంగా జర్నలిస్టులకు తెలియంది కాదు. కానీ.. ఏదో జరగబోతుందన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు అల్లిన కథనాలకు అందరూ తానా.. తందానా అన్నట్లుగా వ్యవహరించారు. ఈ కారణంగానే ఆ రోజున స్టాక్ మార్కెట్ తీవ్రంగా నష్టపోయింది.

నిజానికి కీలక స్థానాల్లో ఉన్న వారికి.. మీడియాలో పని చేస్తున్న వారికి కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి కావటం ఖాయమన్న సంగతి తెలిసిందే. అయినప్పటికి ఏదో జరుగుతుందన్న భావనను కలుగు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే నెలకొందని చెప్పాలి. తాజాగా దేశ వ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 7 రాష్ట్రాల్లో జరిగిన ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్లు లెక్కింపు ఈ ఉదయం (శనివారం) ప్రారంభమైంది.

సార్వత్రిక ఎన్నిక తర్వాత మోడీ హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాన్ని తమకు తోచిన రీతిలో విశ్లేషిస్తున్న వైనంపైనే అసలు అభ్యంతరమంతా. కారణం.. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్ని చూస్తే.. ఏడు రాష్ట్రాల్లో జరిగాయి.ఈ ఏడు రాష్ట్రాల్లో ఇండియాకూటమి కానీ.. కొన్ని పార్టీల పలుకుబడి స్పష్టంగా ఉన్న సంగతి తెలిసిందే.

మొత్తం 13 స్థానాలకు 11 స్థానాల్లో ఇండియా కూటమి గెలుపు బాటలో ఉంటే.. ఇద్దరు ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించే పరిస్థితి. ఉప ఎన్నిక జరిగిన పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ బలంగా లేదన్నది మర్చిపోకూడదు. పశ్చిమ బెంగాల్ లోనూ అధికారంలో ఉన్న దీదీ సర్కారే.. ఈ రాష్ట్రంలో మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరగ్గా.. మూడు స్థానాల్లో గెలుపు కట్టబెట్టిన ఓటర్లు.. మరో స్థానంలోనూ టీఎంసీనే పైచేయిగా ఉంది.

హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. అలాంటప్పుడు ఆ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో సీఎం సుఖ్వీందర్ సుఖు సతీమణి బరిలో ఉన్నప్పుడు గెలుపు ఆమె పక్షాన కాకుండా మరెవరి వైపు ఉంటుంది? మరో స్థానంలోనూ అధికార కాంగ్రెస్ అధిక్యతలో ఉండగా.. ఇంకో స్థానంలో మాత్రం విపక్ష బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్ లో మాత్రం బీజేపీ అధికారంలో ఉంది.

అక్కడ జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థులు అధిక్యంలో ఉండటం మాత్రం కాస్తంత సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. మధ్యప్రదేశ్ లోని ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి.. బిహార్ లో జేడీయూ అభ్యర్థి ముందంజలో ఉండగా.. తమిళనాడులో అధికార పార్టీ (డీఎంకే) అభ్యర్థి ముందంజలో ఉండటం సహజ పరిణామంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. బీజేపీ అధిక్యత ఉన్న రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగకపోవటం కూడా తాజా చర్చకు కారణంగా చెప్పాలి. ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు మోడీ అండ్ కోకు డేంజర్ బెల్ గా చెప్పటం అతిశయోక్తి అవుతుంది. కాకుంటే.. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అసన్నమైందని మాత్రం చెప్పక తప్పదు.