ముదిరి పాకాన వలంటీర్ల వ్యవహారం!
ఇలా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల మంది వలంటీర్లను వైసీపీ ప్రభుత్వం నియమించింది.
By: Tupaki Desk | 27 Jun 2024 7:38 AM GMTఆంధ్రప్రదేశ్ లో 2019లో వైసీపీలో అధికారంలో వచ్చాక ప్రజలకు వారి ఇంటి ముంగిటే ప్రభుత్వ పథకాలను అందించడానికి వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రామాల్లో అయితే ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్ చొప్పున, పట్టణాలు, నగరాలు అయితే ప్రతి 75 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున నియమించింది. ఇలా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల మంది వలంటీర్లను వైసీపీ ప్రభుత్వం నియమించింది. వీరికి నెలకు రూ,5 చొప్పున గౌరవ వేతనం అందించింది.
వలంటీర్ల ద్వారానే వైసీపీ పాలనలో లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే పింఛన్లను అందజేశారు. అలాగే వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను గుర్తించడం, వారి బయోమెట్రిక్ తీసుకోవడం వంటి పనులను కూడా వలంటీర్లే చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు వలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ తదితరుల నేతృత్వంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ హైకోర్టు తలుపుతట్టింది. అలాగే వలంటీర్ల ద్వారా పింఛన్ల ప్రక్రియను నిలిపేయాలని.. వలంటీర్లను ఉపయోగించుకుని ఎన్నికల్లో వైసీపీ లాభపడే ప్రమాదం ఉందని కోర్టుకు నివేదించింది.
ఈ నేపథ్యంలో వలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం వలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు కేటాయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పింఛన్ల పంపిణీ నుంచి కూడా వలంటీర్లను ఎన్నికలు జరిగిన మే, జూన్ నెలలకు తప్పించింది.
మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు వలంటీర్ వ్యవస్థపై విరుచుకుపడ్డారు. వలంటీర్ల ద్వారా ప్రభుత్వం డేటాను సేకరిస్తోందని.. ఈ డేటా అంతా హైదరాబాద్ లో వైసీపీ నేత నిర్వహిస్తున్న డేటా సెంటర్ కు చేరుతోందని బాంబుపేల్చారు. అంతేకాకుండా ఏపీలో 30 వేల మంది మహిళలు అదృశ్యమవ్వడం వెనుక వలంటీర్ల పాత్ర ఉందన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై కొందరు వలంటీర్లతో పోలీసులకు ఫిర్యాదులు కూడా చేయించారు.
ఇంకోవైపు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు వైసీపీ ప్రభుత్వం అందించిన రూ.5 వేలను రూ.10 వేలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినా వలంటీర్ల వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం తేల్చడం లేదు.
కాగా జూలై నెలకు కూడా పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను ప్రభుత్వం తప్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీని చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు వైసీపీ కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించారని.. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఒక వ్యక్తి తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులకే వలంటీర్ పోస్టులు దక్కాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుదనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు ఇప్పటికే వలంటీర్లకు హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకుంటే మాట ఇచ్చి తప్పినవారిగా ఆయనపై విమర్శలు వ్యక్తమవుతాయి. కొనసాగించడానికి అంగీకరిస్తే.. ఇప్పుడున్న వలంటీర్లను యథావిధిగా కొనసాగిస్తారా లేక వారిని మార్చేస్తారా? లేక కొత్త వలంటీర్ విధానాన్ని ప్రవేశపెడతారా అనేది తేలాల్సి ఉంది.
మరోవైపు వైసీపీ ఇప్పటికే విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టింది. చంద్రబాబును నమ్మి వలంటీర్లు మోసపోయారని చెబుతోంది. పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను తప్పించడమే ఇందుకు నిదర్శనమని అంటోంది. ఈ నేపథ్యంలో వలంటీర్ వ్యవస్థ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచిచూడాల్సిందే.