Begin typing your search above and press return to search.

ప్రపంచ కుబేరుడిగా అదానీ ...విశాఖ పోర్టు కూడా ఆయన చేతికి...?

వరసబెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను ప్లేట్ లో పెట్టి మరీ అదానీకి ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు.

By:  Tupaki Desk   |   30 Oct 2023 3:57 AM GMT
ప్రపంచ కుబేరుడిగా అదానీ ...విశాఖ పోర్టు కూడా ఆయన  చేతికి...?
X

విశాఖ అంటేనే పబ్లిక్ సెక్టార్ కి కేంద్ర స్థానం. అక్కడ అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అవి ఇవాళా నిన్నా ఏర్పాటు కాలేదు. స్వాతంత్రానికి ముందే పోర్టు లాంటివి వచ్చాయి. చాలా పరిశ్రమలు ముందూ వెనకా వచ్చాయి. అలా పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలతో విశాఖ బలమైన కేంద్రం గా మారింది. అభివృద్ధి అంతా అలాగే జరుగుతూ వచ్చింది.

ఇపుడు నాలుగైదు దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడానికి కేంద్రం నిర్ణయించడం తో దాని మీద మూడేళ్ళుగా ఆందోళన అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. విశాఖ లో స్టీల్ ప్లాంట్ తో మొదలెట్టి పోర్టు దాకా అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేయడానికి కేంద్రం రెడీ అయిందని వామపక్షాలతో పాటు ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

మాజీ మంత్రి, కిసాన్ సంయుక్త మోర్ఛా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు దీని మీద విశాఖలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ ప్రపంచ కుబేరుడిగా అదానీని చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రీవేటీకరణను అడ్డుకోకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ని కూడా అదానీకే కేంద్రం ఇచ్చేస్తుందని హాట్ కామెంట్స్ చేశారు.

వరసబెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను ప్లేట్ లో పెట్టి మరీ అదానీకి ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ముఖ విలువ కంటే తక్కువగా కారు చౌకగా అమ్మడానికి నిర్ణయం తీసుకోవడం కంటే దారుణం ఉండదని ఆయన మండిపడ్డారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలీ అంటే బీజేపీని ఓడించాల్సిందే అని వడ్డే స్పష్టం చేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్ లో కేవలం మూడు నాలుగు పరిశ్రమలు తప్ప మిగిలినవి అన్నీ కూడా అమ్మేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ మేరకు సింగిల్ పాయింట్ అజెండాతో ముందుకు సాగుతోందని ఆయన అంటున్నారు.

ఈ వైఖరిని అడ్డుకోవాలని బీజేపీతో పాటు దానితో అంటకాగుతున్న పార్టీలను కూడా వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఓడగొట్టాలని ఆయన పిలుపు ఇచ్చారు. సీఐటీయూ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, ద్రవిడ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె ఎస్ చలం, ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ తదితరులు ఈ సదస్సులో మాట్లాడుతూ దేశంలో ఏపీలో బీజేపీ ప్రమేయం లేని పాలన రావాలని నినదించారు. రానున్న ఎన్నికలు ఏపీ భవిష్యత్తుకు విశాఖ భవిష్యత్తుకు కీలకం అని పేర్కొన్నారు. బీజేపీని ఓడించాల్సిందే మోడీని మాజీ ప్రధానిని చేయాల్సిందే అని వారు డిమాండ్ చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీత అంటకాగే పార్టీలను ఓడించాలని వామపక్ష ప్రజాతంత్ర పార్టీలు పిలుపు ఇస్తున్నాయి. ఏపీలో వైసీపీని మాత్రమే దూరం పెడతాయా లేక టీడీపీని కూడానా అన్న చర్చ సాగుతోంది. టీడీపీ బీజేపీని వదిలి వస్తే తమతో కలుపుకుంటామని ఆయా పార్టీలు చెబుతున్న నేపధ్యంలో ఈ సదస్సు సారాంశం బట్టి చూస్తే వైసీపీ బీజేపీలకు చుక్కలు చూపించాలనే కోరుకుంటున్నట్లుగా అర్ధం అవుతోంది అని అంటున్నారు