పసుపు గుమ్మం దగ్గర...త్యాగమూర్తులు ముగ్గురూ !
విజయనగరం జిల్లలో ముగ్గురు కీలక నేతలు త్యాగాలు చేసి పార్టీని గెలిపించారు.
By: Tupaki Desk | 21 Dec 2024 4:04 AM GMTతెలుగుదేశం పార్టీ కోసం అన్నీ వదులుకుని త్యాగం చేసిన ముగ్గురు కీలక నేతల పరిస్థితి అయితే ఇపుడు ఎటూ కాకుండా ఉంది అని వారితో పాటు అనుచరులూ మధనపడుతున్నారు. విజయనగరం జిల్లలో ముగ్గురు కీలక నేతలు త్యాగాలు చేసి పార్టీని గెలిపించారు. కానీ గెలిచి ఆరు నెలలు అయినా పార్టీలో తమకు అయితే ఏ రకమైన అవకాశం దక్కలేదని కనీసం తమను పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ముగ్గురిలో ఇద్దరు ఎన్నారైలుగా ఉన్నారు. అమెరికాలో బ్రహ్మాండమైన ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవహారాలూ అన్నీ వదులుకుని వచ్చి వాలినందుకు గట్టిగా పనిచేసినందుకు పార్టీ పెద్దల నుంచ్ మహ బాగా మర్యాద లభిస్తోందని వాపోతున్నారు. వారిలో ఒకరు చీపురుపల్లికి చెందిన మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు యువ నేత కిమిడి నాగార్జున.
ఆయనకు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆయన అయిదేళ్ల పాటు చీపురుపల్లిలో నిలిచి పోరాటం చేశారు. కానీ ఆయన పెదనాన్న మాజీ మంత్రి అయిన కిమిడి కళా వెంకటరావుకు అవకాశం ఇచ్చారు. దాంతో పెదనాన్నని గెలిపించారు. తనకు ఏదైనా నామినేటెడ్ పదవి అయినా దక్కుతుందని ఎదురుచూసిన ఆయనకు ఏమీ దక్కడం లేదు అని అంటున్నారు.
మరో నేత ఎన్నారై అయిన గొంప క్రిష్ణ. ఎస్ కోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ని ఆశించిన ఈ నాయకుడు చివరికి పార్టీ కోసం తగ్గి పనిచేశారు అని అంటున్నారు. ఈయనకు టీడీపీ అధినాయకత్వం స్థాయిలోనే భారీ హామీ లభించడంతో అన్నీ మానుకుని పార్టీ కోసం కష్టపడ్డారు. అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవి మీకే అని కూడా ఒట్టేసి మరీ చెప్పారట. ఇపుడు చూస్తే మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఆయనతో పాటు అనుచరులు కూడా నిరాశలో ఉన్నారని అంటున్నారు.
ఇక వీరికి తోడు అన్నట్లుగా ఒక అధికారి స్థాయి నేత తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ టీడీపీలో చేరి శక్తి పెట్టి మరీ పనిచేశారు. ఆయనే కోట్ల సుగుణాకర్. ఆయనకు కూడా పార్టీలో ఏదైనా సముచిత స్థానం లభిస్తుంది అనుకుంటే ఎవరూ ఉలకరూ పలకరూ అని బాధ పడుతున్నారుట.
ఇంకా రెండేళ్ళ సర్వీసు ఉంది, బంగారం లాంటి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నత స్థాయిలో హోదా అన్నీ వదిలేసి వచ్చామని అలా ఏదైనా పొరపాటు చేశామా అని ఆయన కూడా కలత చెందుతున్నారుట. ఈ ముగ్గురూ త్యాగమూర్తుగా టీడీపీలో కనిపిస్తున్నారుట. ఇక విజయనగరం జిల్లాకు కొన్ని నామినేటెడ్ పదవులు అయితే దక్కాయి. కానీ ఇంకా చాలా మంది ఆశావహులు ఉన్నారు.
ఎందుకో అధినాయకత్వం వీరి వైపు చూడడం లేదు అని అంటున్నారు. అయితే పార్టీలో ఓపిక వహించి చూస్తే ఎప్పటికి అయినా చాన్స్ దక్కుతుందని అంటున్న వారూ ఉన్నారు. అయితే పక్కవారికి విస్తరిలో వడ్డించి ఇవతల వారిని వేచి చూడమని అంటే తట్టుకోవడం బహు కష్టమే అని అంటున్నారు.