Begin typing your search above and press return to search.

దుమ్ములేపుతున్న కోడిపందాలు... 100 కోట్లు అంటున్నారు!

ఈ క్రమంలో ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఈ పండుగ మూడు రోజులు కోడి పందాలు జోరుగా సాగనున్నాయి

By:  Tupaki Desk   |   15 Jan 2024 12:30 PM GMT
దుమ్ములేపుతున్న కోడిపందాలు...  100 కోట్లు అంటున్నారు!
X

ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. మొదటి రోజు భోగి సందర్భంగా ఊరూరా భోగి మంటలు వేసి పండుగను ప్రారంభించగా... తర్వాతి రోజు సంక్రాంతికి ప్రత్యేకంగా చెప్పుకునే సంప్రదాయ కోళ్ల పందాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా బరిల్లో పందెంకోళ్లు దుమ్ములేపాయి. ఈ క్రమంలో ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఈ పండుగ మూడు రోజులు కోడి పందాలు జోరుగా సాగనున్నాయి!

అవును... గోదావరి జిల్లాలో బరులు కోళ్ల పందాలతో దుమ్ములేసిపోతున్నాయి. నాది నెమలంటే.. నాది డేగ అంటూ బరిబయట పందేరాయుళ్లు చెలరేగిపోతున్నారు. పందెం ముగిసిన తర్వాత గెలిచిన వ్యక్తి ముఖం థౌంసండ్ వాలాలా వెలిగిపోతుంటే.. ఓడిపోయిన వ్యక్తి ముఖం వాడిపోయిన దృశ్యాలు బరుల వద్ద అత్యంత సహజంగా దర్శనమిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రధానంగా గోదావరి జిల్లాల్లో పందెంబరు హైటెక్ హంగులతో ముస్తాబయ్యాయి. ఎల్.ఈ.డీ. స్క్రీన్లు, యాంకర్ల హడావుడితో, డీజే సాంగులతో కోడి పందాలు ఊపందుకున్నాయి. సంక్రాంతి వేడుకలను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాలకు వాహనాలు క్యూకట్టాయి. ఈ సందర్భంగా ప్రతీ బరివద్ద చికెన్ పకోడి తినడం సంబరాల్లో ఒకభాగం.

ఇందులో భాగంగా... కోనసీమ, నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, రాజమండ్రి మొదలైన ప్రాంతాల్లో భారీగా కోడి పందాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. రాజకీయ నేతల మద్దతుతో నిర్వాహకులు కోడి పందాలకు భారీగా ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా... తెలుగు రాష్ట్రాల్లో ఈ కోడిపందాల ఈవెంట్లలో మొదటి రోజు సుమారు రూ.100 కోట్లు చేతులు మారాయని అంటున్నారు. ఇందులో ప్రధానంగా ఒక్క గోదావరి జిల్లాల్లో జరిగిన పందాల ద్వారానే సుమారు 40-50 కోట్ల రూపాయల ట్రాన్జాక్షన్స్ జరిగినట్లు చెబుతున్నారు. దీంతో... ఈ ఏడాది సంక్రాంతి పందాలు ఏ రేంజ్లో జరిగి ఉంటాయనేది అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు!