కర్ణాటక ఎఫెక్ట్.. కూటమికి వరమేనా..?
ఎందుకంటే.. ఏపీకి రావాలని అనుకున్న తెలంగాణ ప్రజలు.. ఏపీ సరిహద్దుల వరకు.. వేర్వేరు బస్సుల్లో ఉచితంగా వచ్చి..అ క్కడనుంచి ఏపీ బస్సులు ఎక్కుతున్నారు.
By: Tupaki Desk | 19 July 2024 4:30 PM GMTపొరుగు రాష్ట్రంలో తలెత్తే సమస్య.. పక్క రాష్ట్రాలకు వరంగా మారుతున్నాయి. అదేసమయంలో కొన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయి కూడా. ఉదాహరణకు తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యం వచ్చిన తర్వాత.. ఏపీకి కూడా ఆదాయం తగ్గిపోయింది. చిత్రంగా ఉన్నా నిజం. ఎందుకంటే.. ఏపీకి రావాలని అనుకున్న తెలంగాణ ప్రజలు.. ఏపీ సరిహద్దుల వరకు.. వేర్వేరు బస్సుల్లో ఉచితంగా వచ్చి..అ క్కడనుంచి ఏపీ బస్సులు ఎక్కుతున్నారు. దీంతో సుమారు 250 కిలో మీటర్ల రేడియస్‌లో ఏపీ ఆర్టీసీకి ఆదాయం పోయింది.
అదేవిధంగా కర్ణాటకలోనూ జరుగుతోంది. కర్ణాటక నుంచి ఏపీకి రావాలనుకున్న ప్రజలు కూడా.. ఇలానే అక్కడి బస్సుల్లో ఉచితంగా ఏపీ సరిహద్దుల వరకు వచ్చి.. తర్వాత ఏపీ బస్సులు ఎక్కుతున్నారు. దీంతో కూడా ఏపీ ఆదాయం పడిపోయింది. ఇలా.. ఒక రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలు.. పక్కనున్న రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరంపరలో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఏపీకి వరంగా మారుతుందని అంటున్నారు పరిశీలకులు.
ఏంటీ నిర్ణయం..
కర్ణాటకలో స్థాపించిన ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో.. ఉద్యోగాలను.. 75 శాతం మేరకు.. స్థానిక కన్నడ యువతకే ఇవ్వాలని సిద్దరామయ్య సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. దీనిపై విమర్శ లు వచ్చాక వెనక్కి తగ్గినా.. త్వరలోనే పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఇక, ఈ ఉత్తర్వులపై అక్కడి ప్రైవేటు సంస్థలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇలా అయితే.. ఉండేది లేదన్నాయి. నోటీసులు కూడా ఇచ్చాయి. దీంతో సర్కారు వెనక్కి తగ్గింది.
కానీ, ప్రైవేటు సంస్థలు మాత్రం.. సర్కారును నమ్మే పరిస్థితి లేదు. ఏ క్షణంలో అయినా.. తిరిగి 75 కాకపోయినా.. 50 శాతమైనా.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే షరతు పెడతాయని భావిస్తున్నాయి. దీంతో పోరుగు రాష్ట్రాల వైపు.. దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో ఆయా సంస్థలకు కనిపిస్తున్న రెండు రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ ఉన్నాయి. తెలంగాణలోనూ 75 శాతం కోటా తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
దీంతో మెజారిటీ సంస్థలు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. దీనిని చంద్రబాబు సర్కారు సాధ్యమైనంత వేగంగా అందిపుచ్చుకుంటే.. ఈ ఏడాదిలోనే పెట్టుబడుల క్యూ పెరగనుందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా.. పెట్టుబడులు పెట్టేవారికి తాము సహకరిస్తామని ప్రకటించారు. దీనిని ఇంకా స్త ముందుకు తీసుకువెళ్లి.. ఎలాంటి షరతులు లేకుండా తాము ప్రోత్సహిస్తామని చెబితే.. రాష్ట్రంలో పెట్టుబడులు మరిన్నిపెరుగుతాయని అంటున్నారు పరిశీలకులు.